న్యూఢిల్లీ: టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణలో ఉన్న శ్రేయస్‌ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. రేపటి వరకు సీవోఈ కోచ్‌లు, ఫిజియోల మధ్యనే ట్రెయినింగ్ చేయనున్నాడు. ఆ తర్వాత వాళ్లు ఇచ్చే నివేదికను బట్టి శ్రేయస్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరి 2, 6న జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ల్లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు.
ఆ తర్వాత 11న వడోదరాలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియాలో చేరనున్నాడు. ‘శ్రేయస్ విషయంలో సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. వీహెచ్‌టీలో ముంబై తరఫున రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అయితే సీవోఈ ఇచ్చే నివేదికను బట్టే తుది నిర్ణయం ఉంటుంది. అతను నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎటువంటి అసౌకర్యం కనిపించలేదు’ అని ఎంసీఏ అధికారి ఒకరు వెల్లడించాడు.
