నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

లింగంపేట, వెలుగు : నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని, సర్కిల్ పరిధిలో కేడీ, అనుమానితులు, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని ఎస్పీ రాజేశ్​చంద్ర పోలీస్​అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఎల్లారెడ్డి సర్కిల్ ఆఫీస్​లో రికార్డుల నిర్వహణ, దర్యాప్తులో ఉన్న గ్రేవ్​ కేసుల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఎస్పీ మాట్లాడారు.  పోలీస్ ఉద్యోగం కేవలం వృత్తి మాత్రమే కాదని, సేవాభావం, బాధ్యతతో కూడుకున్నదని తెలిపారు. కేసులు పెండింగ్​లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

నేరాలు జరిగిన ప్రాంతాలను సర్కిల్ మ్యాప్​లో స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్​లను  తరచూ తనిఖీ చేసి, కేసుల పురోగతిని  సమీక్షిస్తూ ఎస్​హెచ్​వోలకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఆస్తి సంబంధిత నేరాలు జరిగే ప్రాంతాలను ‘క్రైమ్ హాట్​స్పాట్స్’గా గుర్తించి, నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించాలన్నారు. డయల్ 100కు కాల్ అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలన్నారు.  బ్లూకోల్ట్స్,పెట్రోలింగ్ వాహనాల సిబ్బంది 24 గంటలు గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సర్కిల్ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజారెడ్డి, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.