- చేపల వేటకు వెళ్లి చిక్కుకున్న ముగ్గురు గ్రామస్థులు
- చెట్టెక్కి కూర్చొని ప్రాణాలు దక్కించుకున్నరు
- ఒడ్డుకు చేర్చిన పోలీసులు
- ఘటనపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి , ఎమ్మెల్యే జాజాల ఆరా
లింగంపేట,వెలుగు: మండలంలోని రాంపల్లి తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు గురువారం లింగంపేట పెద్ద వాగులో చేపల వేటకు వెళ్లి అక్కడే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన దేవసోత్ దూప్య, దేవసోత్ బాలు, దేవసోత్ చాందిరాం రాంపల్లి తండా సమీపంలోని లింగంపేట పెద్దవాగులో గురువారం ఉదయం 8గంటలకు చేపలు పట్టడానికి వెళ్లారు. ఉదయం 9 నుంచి గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో వాగులో వరద ఉధృతి పెరిగింది. గమనించిన ముగ్గురు వాగులోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాధితులు డయల్ 100 కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, లింగంపేట ఎస్ఐ శంకర్ పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.వాగులో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చేందుకు తాడును విసిరి రెండు వైపులా చెట్లకు కట్టి ప్రయత్నం చేశారు. రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు వాగు ప్రవాహం పెరిగింది. ఐదున్నరగంట ల సమయంలో వాగు ఉదృతి తగ్గడంతో రాంపల్లి తండాకు చెందిన మోహన్ మరికొందరు కలిసి వాగులోదిగి ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్..
ఘటనా స్థలానికి కలెక్టర్ జితేష్విపాటిల్, ఆర్డీఓ శ్రీనునాయక్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ మారుతి, ఆర్ఐబాలయ్య, నాగిరెడ్డి పేట, ఎల్లారెడ్డి, తాడ్వాయి ఎస్ఐ ఆంజనేయులు, గణేశ్, ఎల్లారెడ్డి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
మంత్రి, ఎమ్మెల్యే ఆరా..
తండావాసులు వాగులో చిక్కుకున్నట్లు తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ జిల్లా యంత్రాంగాన్నిఅప్రమత్తం చేసి, ఎప్పటి కప్పుడు ఆరా తీశారు. బాధితులను ఒడ్డుకు చేర్చేందుకు ఎమ్మెల్యే సురేందర్ హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకుని బయలు దేరారు. అప్పటికే వీరు సురక్షితంగా బయటకు చేరడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తిరిగి పంపించారు.
