పోలవరం నుంచి కావేరికి లింక్..! తెలంగాణకు తీరని నష్టం చేసేలా కేంద్రం, ఏపీ కలిసి కొత్త కుట్ర

 పోలవరం నుంచి కావేరికి లింక్..! తెలంగాణకు తీరని నష్టం చేసేలా కేంద్రం, ఏపీ కలిసి కొత్త కుట్ర
  • ఏపీ సూచన మేరకు ఎన్​డబ్ల్యూడీఏ తాజా ప్రతిపాదనలు
  • సమ్మక్క సాగర్​ బ్యారేజీ నుంచి నాగార్జునసాగర్​కూ నీటి మళ్లింపు
  • అదే జరిగితే సమ్మక్క సాగర్​ హక్కులూ వదులుకోవాల్సిన పరిస్థితి
  • రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించేలా కొత్త ప్రపోజల్స్

హైదరాబాద్, వెలుగు:  నదీ జలాల్లో తెలంగాణకు తీరని నష్టం చేసేలా కేంద్రం, ఏపీ కలిసి కొత్త కుట్రకు తెరలేపాయి. ఇన్నాళ్లూ మన నీళ్లను గోతికాడి నక్కలా తోడుకపోతున్న పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు తెలంగాణ నుంచే చేపట్టాలనుకున్న గోదావరి కావేరి లింకు ప్రాజెక్టునూ తన్నుకుపోయే ప్రయత్నాల్లో ఉన్నది.  నదుల అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) చేసిన కొత్త ప్రతిపాదనలతో ఈ విషయం స్పష్టమవుతోంది.

ఇందులో భాగంగా ఏపీ చేపడ్తున్న జీసీ లింక్​ను పక్కనపెట్టి,  పోలవరం మీదుగా కావేరి కి లింక్​ చేసేందుకు  సిద్ధమైపోతున్నది. శుక్రవారం ఏపీతో ఎన్​డబ్ల్యూడీఏ మీటింగ్​ నిర్వహించి మరీ.. ఏపీ చేసిన ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. దీని వల్ల మనకు దక్కాల్సిన జలాలను ఏపీకి పైసా ఖర్చు లేకుండా కేంద్రం దొడ్డిదారిన ముట్టజెప్పేందుకు రంగం సిద్ధమవుతోంది.

మహానది టూ కావేరి వయా పోలవరం.. 

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి కావేరి లింక్​ను చేపట్టి.. చత్తీస్​గఢ్​ వాడుకోని 148 టీఎంసీల నీళ్లను తరలించాలని నిర్ణయించింది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి తమిళనాడుకు నీళ్లివ్వాలన్నది ప్రతిపాదన. అందులో 50 టీఎంసీల   మనకిచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది. మన భూభాగం నుంచి చేపడితే సగం వాటా ఇవ్వాలని తెలంగాణ పట్టుపడ్తోంది.  ఈక్రమంలో నదుల అనుసంధానంలో మరో లింక్​నూ కేంద్రం అప్పట్లోనే ప్రతిపాదించింది.

జీసీ లింక్​ అయ్యాక మహానది జలాలను ధవళేశ్వరం వరకు తరలించాలన్నది ప్లాన్​. కానీ, ఇప్పుడు కొత్తగా సవరిస్తున్న ప్రణాళికల్లో భాగంగా మహానది జలాలనే నేరుగా కావేరికి తరలించాలని ఎన్​డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఈమేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో.. మహానది జలాలను ధవళేశ్వరం బ్యారేజీకి తరలించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఏపీ ఎన్​డబ్ల్యూడీఏకి చెప్పింది. వంశధార నదిపై గొట్టా బ్యారేజీకి ఎగువన వంశధార ఉపనది అయిన మహేంద్రతనయలో కాల్వలు లేకుండానే నేరుగా మహానది జలాలను తరలించవచ్చని ఏపీ ప్రతిపాదించింది.

ఆ నీళ్లు గొట్టా బ్యారేజీలోకి వచ్చి చేరుతాయి కాబట్టి.. అక్కడి నుంచి హిరమండలంలోని జలాశయానికి తరలిస్తారు. అక్కడి నుంచి తారకరామతీర్థ సాగర్​ రిజర్వాయర్​, అక్కడి నుంచి ఏలేరు రిజర్వాయర్​కు తరలిస్తారు. ఏలేరు నుంచి పోలవరం ప్రాజెక్ట్​లోకి నీటిని పోస్తారు. మొత్తంగా మహానది నుంచి 147 టీఎంసీల జలాలను పోలవరానికి మళ్లిస్తారు. అక్కడి నుంచి నల్లమలసాగర్​, బనకచర్ల, సోమశిల ప్రాజెక్ట్​ మీదుగా తమిళనాడులోని కావేరి నదికి జలాలను తరలిస్తారు. ఇప్పుడు ఈ ప్రతిపాదనకు ఎన్​డబ్ల్యూడీఏ ఆమోదం తెలిపినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

సమ్మక్క సాగర్​నీటిపై మన హక్కులకు ఎసరు..  

జీసీ లింక్​ చేపడితే.. మనతో పాటు ఏపీకి కూడా నీళ్లలో వాటా లభించేది. కానీ, ఇప్పుడు మహానది ద్వారా పోలవరానికి, అక్కడి నుంచి కావేరికి నీటిని తరలిస్తే చుక్క నీళ్లు కూడా తెలంగాణకు రాకుండా పోతాయని ఇరిగేషన్​ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. పైగా పనిలోపనిగా కేంద్రం మరో ప్రతిపాదన పెట్టింది. ఇప్పటికే మన ప్రభుత్వం కట్టిపెట్టిన సమ్మక్కసాగర్​ బ్యారేజీ నుంచి నాగార్జునసాగర్​ ప్రాజెక్టులోకి నీటిని మళ్లించాలని భావిస్తోంది.

దీని వల్ల ఆ ప్రాజెక్టుకున్న 47 టీఎంసీల నీటిపై హక్కులు పోయే ప్రమాదాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.  ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్టుకు కేంద్రంతో పాటు ఏపీ లింకు పెట్టి కూర్చున్నాయి. బనకచర్లకు మనం ఓకే చెప్తేనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్​వోసీ ఇచ్చేలా పీటముడి వేశాయి.  అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మనం చూపించిన గోదావరి డైవర్షన్​ వాటర్​ 45 టీఎంసీలకు బదులుగా.. సమ్మక్కసాగర్​ బ్యారేజీ నుంచి సాగర్​కు మళ్లించే 47 టీఎంసీల జలాలను ఏపీకి రాసివ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మైనర్​ ఇరిగేషన్​ కింద చూపించిన మరో 45 టీఎంసీలకు చంద్రబాబు నుంచి ఎన్వోసీ వస్తుందన్నమాట! ఏపీ కట్టే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు 200 టీఎంసీలకు, సమ్మక్కసాగర్​ నుంచి 47 టీఎంసీలకు మనం ఓకే చెప్తే.. చివరకు మనకు మన నికర జలాల్లో హక్కుగా వచ్చే వాటా కేవలం 45 టీఎంసీలే కావడం గమనార్హం. ఈ లెక్కన తెలంగాణకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు కేంద్రం పోలవరం నుంచి కావేరికి అనుసంధానం చేస్తే.. ఏపీకి పైసా ఖర్చు లేకుండా పోలవరం నల్లమలసాగర్​, పోలవరం బనకచర్ల ప్రాజెక్టులు పూర్తయిపోతాయి.

ఆది నుంచీ కుట్రలే..

తెలంగాణ ప్రాజెక్టులపై ఇటు ఏపీ, అటు కేంద్రం ఆది నుంచీ కుట్రలు పన్నుతున్నాయి. మన ప్రాజెక్టులకు టెక్నికల్​ క్లియరెన్సులు రాకుండా అడ్డుపడుతున్నాయి. ఓవైపు ఏపీకి సర్వజల హక్కులను రాసిస్తున్న కేంద్రం.. తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసింది. కానీ, జాతీయ హోదా ఇవ్వకపోగా.. ప్రాజెక్టు డీపీఆర్​ను తిప్పి పంపించింది. ఎన్​డీఏలో భాగస్వామి చంద్రబాబు కోసం కేంద్రం.. తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలూ లేకపోలేదు. ఇటు కృష్ణా జలాల వినియోగంలోనూ కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్న కృష్ణా బోర్డు కూడా ఏపీ చెప్పినట్టే ఆడుతున్నది.

ఏపీ ఎప్పుడంటే అప్పుడు మీటింగులు పెట్టడం.. మనం అడిగితే కాదనడం.. కోటాకు మించి ఏపీ నీటిని వాడుకుంటున్నా పల్లెత్తు మాట అనకపోవడం వంటి ఎన్నో చర్యలకు పాల్పడుతున్నది. ఏపీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. కృష్ణా బోర్డు ఒక్కసారైనా చర్యలు తీసుకోలేదు. ఈ పరిణామాలన్నీ.. తెలంగాణ జలహక్కుల్ని కాలరాసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదని చెప్పకనే చెప్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.