V6 News

12 వేలు పెట్టి టికెట్ కొన్నాం.. మెస్సీ ఫేస్ కూడా కనిపించలే.. కట్టలు తెంచుకున్న మెస్సీ ఫ్యాన్స్ కోపం !

12 వేలు పెట్టి టికెట్ కొన్నాం.. మెస్సీ ఫేస్ కూడా కనిపించలే.. కట్టలు తెంచుకున్న మెస్సీ ఫ్యాన్స్ కోపం !

కోల్‌కత్తా: కోల్‌కత్తాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోల్ కత్తాకు వచ్చిన ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ మ్యాచ్‌ ఆడకుండా వెళ్లిపోయారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్ట్‌ లేక్‌ స్టేడియంలోకి వెళ్లిన మెస్సీ పట్టుమని పది నిమిషాలు కూడా లేకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయారు. మెస్సీ మ్యాచ్ ఆడతాడని ఆశించి వేలకు వేలు పెట్టి టికెట్లు కొన్న అభిమానుల కోపం కట్టలు తెంచుకుంది. 12 వేలు పెట్టి టికెట్ కొంటే ఇలా ఉసూరుమనిపించడం దారుణమని మెస్సీ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోయారు.

స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. గ్రౌండ్‌లోకి కుర్చీలు విరగ్గొట్టారు. స్టేడియంలోకి వాటర్‌ బాటిళ్లు విసిరేసి అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్‌ యత్నించారు. ఫ్యాన్స్‌ గొడవ చేయడంతో మెస్సీ టీమ్‌ సొరంగం ద్వారా బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఐదు నిమిషాల్లో మెస్సీ అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియం లోపల నానా రచ్చ చేశారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌ స్టార్ లియోనెల్ మెస్సీ ఇండియాలో మూడు రోజులు.. నాలుగు నగరాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది.

గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం తెల్లవారుజామున కోల్ కత్తాకు చేరుకున్నారు. ఆ సమయంలో కూడా చలి వణికిస్తున్నా లెక్కచేయకుండా మెస్సీ అభిమానులు వేలాది మంది విమానాశ్రయం దగ్గర బారులు తీరారు. మెస్సీ విమానం తెల్లవారుజామున 2.26 గంటలకు దిగడంతో అంతర్జాతీయ రాకపోకల టెర్మినల్ వద్ద ఆయన అభిమానులు ఎదురుచూస్తున్న దృశ్యాలు కనిపించాయి. మెస్సీ కనిపించగానే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

ఫుట్‌బాల్ ఐకాన్‌ను ఒక్కసారిగా చూడాలనే ఆశతో గేట్ 4 దగ్గర అర్జెంటీనా జెండాలను ఊపుతూ, ఫోన్లలో వీడియోలు తీస్తూ, ఎంట్రీ దగ్గరకు పరిగెత్తుతూ ‘మెస్సీ.. మెస్సీ’ అనే నినాదాలతో ఆయన అభిమానులు హోరెత్తించారు. ఒక కాన్వాయ్ మెస్సీని ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు తీసుకెళ్లింది. ఆ హోటల్ దగ్గర కూడా రాత్రంతా ఎదురుచూస్తూ అభిమానులు మెస్సీ రాక కోసం ఎదురుచూశారు. కొందరు డబ్బున్న అభిమానులు మెస్సీ దిగిన హోటల్లోనే రూమ్స్ తీసుకున్నారు.