గ్రేటర్‌‌లో కిక్కే కిక్కు.. రోజుకు రూ.32కోట్ల మందు తాగిన్రు

గ్రేటర్‌‌లో కిక్కే కిక్కు.. రోజుకు రూ.32కోట్ల మందు తాగిన్రు

గత ఏడాది కంటే అదనంగా రూ.103 కోట్లు పెరిగిన ఆదాయం

రాష్ట్రవ్యాప్తంగా రూ.2వేల 567 కోట్ల సేల్స్

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మందు మస్తు అమ్ముడుపోయింది. ఎలక్షన్‌‌ నోటిఫికేషన్‌‌ వచ్చినప్పటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు డిపోల నుంచి లిక్కర్‌‌ భారీగా లిఫ్ట్‌‌ చేశారు. దీంతో సర్కారుకు మస్తు ఆదాయం సమకూరింది.

రంగారెడ్డిలో ఎక్కువ

గ్రేటర్‌‌లో హైదరాబాద్‌‌–1, హైదరాబాద్‌‌–2, మేడ్చల్‌‌–1, మేడ్చల్‌‌–2, రంగారెడ్డి–1, రంగారెడ్డి–2 డిపోలున్నాయి. వీటి నుంచే గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలో ఉన్న వైన్స్‌‌, బార్లకు లిక్కర్ వెళ్తుంది. నవంబర్‌‌ ఒకటో తేదీ నుంచి 29 వరకు రూ.926 కోట్ల లిక్కర్​ను డిపోల నుంచి లిఫ్ట్‌‌ చేశారు. అంటే రోజుకు రూ.32 కోట్ల చొప్పున లిక్కర్ సేల్‌‌ అయ్యింది. నవంబర్​లో మొత్తంగా హైదరాబాద్‌‌లో రూ.255 కోట్లు, మేడ్చల్‌‌లో రూ.308 కోట్లు, రంగారెడ్డిలో రూ. 363 కోట్ల చొప్పున మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక గతేడాది నవంబర్‌‌ ఒకటి నుంచి 29వ తేదీ వరకు రూ.823 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి రూ.103 కోట్లు అదనంగా లిక్కర్‌‌ సేల్‌‌ అయ్యింది. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటంతో నవంబర్‌‌ 29వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్‌‌ అయ్యాయి.

31.6 లక్షల కేసుల లిక్కర్‌‌ సేల్​

ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా సేల్స్‌‌ బాగానే ఉన్నాయి. స్టేట్‌‌వైడ్‌‌గా రూ.2,567 కోట్ల మందు డిపోల నుంచి లిఫ్ట్‌‌ అయ్యింది. ఇందులో 31.6 లక్షల కేసుల లిక్కర్‌‌, 23.8 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. రాష్ట్రంలో అధికంగా నవంబర్ 27వ తేదీన రూ.170 కోట్లు, 28వ తేదీన రూ.178 కోట్ల లిక్కర్‌‌ తరలించారు. ఎక్సైజ్‌‌ చరిత్రలో అత్యధికంగా అక్టోబర్‌‌లో రూ.2,623 కోట్ల లిక్కర్‌‌ సేల్‌‌ అయ్యింది. అయితే నవంబర్‌‌లో 29 రోజుల్లో జరిగిన సేల్స్​కు సోమవారం అమ్మకాలు కూడా కలిపితే ఈ రికార్డు అధిగమించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక గతేడాది నవంబర్‌‌లో 2,240 కోట్ల మద్యం అమ్మారు. ఇందులో 36.5 లక్షల కేసుల లిక్కర్‌‌, 42 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. ఈ ఏడాది రెండు సార్లు లిక్కర్‌‌ రేట్లు పెరగడంతో సేల్స్‌‌ తక్కువగా ఉన్నా ఆదాయం మాత్రం ఎక్కువగా వస్తోంది.

మే నుంచి రూ.17 వేల కోట్ల లిక్కర్‌‌ సేల్

లాక్​డౌన్​తో మార్చి 22 నుంచి సుమారు రెండు నెలలపాటు మద్యం దుకాణాలు బంద్‌‌ అయ్యాయి. మే నుంచి తిరిగి వైన్స్‌‌లు ఓపెన్ అయ్యాయి. బార్లకు అక్టోబర్‌‌లో పర్మిషన్‌‌ ఇచ్చారు. ఈ ఏడాది మే నుంచి నవంబర్‌‌ 29వ తేదీ వరకు రూ.17,035 కోట్ల లిక్కర్‌‌ సేల్‌‌ అయ్యింది. ఇందులో అక్టోబర్‌‌లో అత్యధికంగా రూ.2,623 కోట్ల మద్యం అమ్మారు. ఇదే గతేడాది మే నుంచి నవంబర్‌‌ వరకు రూ.12,638 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ సారి రూ.4,397 కోట్ల ఆదాయం ఎక్కువ వచ్చింది.