ఎక్సైజ్​ శాఖను ముంచుతున్న లిక్కర్‍ మాఫియా 

ఎక్సైజ్​ శాఖను ముంచుతున్న లిక్కర్‍ మాఫియా 
  • ప్రూఫ్​లు ఇచ్చి జైలుపాలవుతున్న అమాయకులు 
  • దందాలో లిక్కర్ ​వ్యాపారులు, బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం 
  • వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండేండ్లలో సుమారు 20 మందిపై కేసులు 

వరంగల్‍, వెలుగు: 'మీ ఐడీ, అడ్రస్‍ ఫ్రూఫ్‍, ఫొటోలు ఇవ్వండి చాలు... మీ తరఫున మేమే డబ్బులు కట్టి వైన్​షాపులకు టెండర్లు వేస్తాం. ఒకవేళ మీ పేరున షాపు వస్తే మీకు కమీషన్‍ ఇస్తాం’ అంటూ లిక్కర్​కేటుగాళ్లు దగ్గరోళ్లు, అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. వైన్​షాపు టెండర్‍ వేసేందుకు ఆధార్‍ కార్డులివ్వమంటే ఇచ్చి పలువురు అమాయకులు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. మరోవైపు రూపాయి చెల్లించకుండానే ఎక్సైజోళ్ల అకౌంట్లలో రూ.లక్షలు జమ చేసినట్లు ఫేక్‍ బ్యాంక్‍ చలాన్లు క్రియేట్‍ చేసి టెండర్లు వేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల సర్కారుకు ఏటా కట్టాల్సిన లైసెన్స్ ఫీజును ఇలానే ఫేక్‍ చలాన్లతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇదంతా కంట్రోల్​చేయాల్సిన అబ్కారీ ఆఫీసర్లు ఏండ్లు దాటినా గుర్తించడంలేదు. పై స్థాయిలో ఆడిట్​జరిగినప్పుడే ఇలాంటి మోసాలు బయటపడుతున్నాయి. ఈ ఘటనల్లో లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం ప్రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇచ్చిన అమాయకులు బలవుతున్నారు.  కాగా, లిక్కర్‍ మాఫియాకు కొందరు ఎక్సైజ్‍ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

అకౌంట్లలో డబ్బులు వేసినట్లు ఫేక్‍ చలాన్లు

రెండేళ్లకోసారి ప్రభుత్వం వైన్‍ షాపులకు టెండర్లు నిర్వహిస్తోంది. లిక్కర్‍ మాఫియా అమాయకులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు గండి కొడుతున్నారు. టెండర్లు వేసే క్రమంలో అబ్కారీ శాఖ అకౌంట్లో ఒక్కోదానికి  రూ.2 లక్షలు కట్టాకే వేలంలో పాల్గొనాల్సి ఉండగా.. డబ్బులు ఖాతాలో వేయకుండానే వేసినట్లు ఫేక్‍ చలాన్లు అధికారుల చేతిలో పెట్టి మోసం చేస్తున్నారు. ఇంకోచోట మూడు, ఆరు నెలలకోసారి కట్టాల్సిన లైసెన్స్​ ఫీజు సైతం ప్రభుత్వ ఖాతాలో వేయకుండానే వేసినట్లు చలాన్లు క్రియేట్‍ చేసి మోసానికి పాల్పడుతున్నారు. 

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 కేసులు, రూ.2.02 కోట్ల ఛీటింగ్‍ 

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండేండ్లలో లిక్కర్ దందాలో 3 కేసులు నమోదవగా రూ.2.02 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. వరంగల్‍ జిల్లా వర్ధన్నపేటలో నాలుగు వైన్‍ షాపులు లైసెన్స్​ఫీజు కట్టేందుకు  రూ.68.75 లక్షల విలువైన 7 ఫేక్​ చలాన్లు సృష్టించారు. దర్జాగా బ్యాంక్‍ స్టాంప్‍ వేసుకెళ్లి  మోసం చేశారు. 2021 జనవరిలో జరిగిన ఈ ఘటన బయటకు రావడంతో పోలీసులు మరింత లోతుగా ఎంక్వైరీ చేశారు. ఈ క్రమంలో రెండో కేసులో రూ.1,13,76,660 విలువ చేసే మరో 13 చలాన్లు నకిలీవని తేలింది. లిక్కర్‍ మాఫియా స్థానిక ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగితో కలిసి దాదాపు రూ.2 కోట్ల వరకు మోసం చేసినట్లు తెలుసుకున్నారు. వారం కింద మరో రూ.22 లక్షల ఇంకో స్కాం బయటకొచ్చింది. భరత్‍కుమార్‍ అనే లిక్కర్​ వ్యాపారి, సీతారాం అనే బ్యాంకు ఉద్యోగితో కలిసి ఈ దందా చేశాడు. 2019–2021లో వైన్‍ షాపు టెండర్లు దక్కించుకునేందుకు 11 మంది పేర్లతో ఒక్కో చలాన్‍కు రూ.2 లక్షలు కట్టినట్లు ఫేక్‍ చలాన్​తో వేలంలో పాల్గొన్నాడు. ఈ లెక్కన ప్రభుత్వానికి రావాల్సిన రూ.22 లక్షలు రాలేదు. 

అమాయకులపై కేసులు 

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ మూడు ఘటనల్లో దందా నడిపే వ్యక్తులతోపాటు వైన్‍ షాపు ఎవరి పేరుమీద ఉందో వారు కూడా బలయ్యారు. రెండేళ్ల కింద 12 మందిపై కేసులు నమోదవగా.. ప్రస్తుతం 13 మందిపై ఛీటింగ్‍ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ పోలీసులు రెండు రోజుల కింద అరెస్ట్​చేశారు. అయితే ఈ మోసంలో అసలు సూత్రధారులు భరత్‍కుమార్‍, బ్యాంకు ఉద్యోగి సీతారాం ఉండగా.. మిగతా 11 మంది అప్పట్లో లైసెన్స్​టెండర్‍ కోసం కేవలం తమ ఐడీ, అడ్రస్‍ ఫ్రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇచ్చిన..వెలుమకంటి గిరిప్రసాద్, మహ్మద్‍ రియాజుద్దీన్, సట్ల లక్ష్మి,  ఆకుల సందీప్, కుళ్ల వెంకన్న, గుడిబోయిన సంతోష్, మేకల శ్రీనివాస్,  కడారి రాజు, మునుకుంట్ల దేవేందర్, తుల్ల దిలీప్, బిషుపాక దయాకర్‍.. వంటివారు బాధితులుగా ఉన్నారు. పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్​చేసేవరకు వీరికి విషయం తెలియలేదు. మొత్తంగా వీరిపై వర్ధన్నపేట పోలీస్‍ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 420, 465, 471 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‍లు  నమోదయ్యాయి.