భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోసగం మద్యం షాపులు ఎస్టీలకే..ఎస్టీల పేర దరఖాస్తులు వేసేందుకు వ్యాపారుల స్కెచ్

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోసగం మద్యం షాపులు ఎస్టీలకే..ఎస్టీల పేర దరఖాస్తులు వేసేందుకు వ్యాపారుల స్కెచ్
  •     బినామీలతో చర్చలు.. జ్యోతిష్యులతో సంప్రదింపులు 
  •     నేటి నుంచి ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ఆఫీస్​ వద్ద దరఖాస్తుల స్వీకరణ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వైన్స్​ షాపులను దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులు అప్పుడే పావులు కదుపుతున్నారు. జిల్లాలో నెలకు దాదాపు రూ.80 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. దీంతో వైన్​​ షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. జిల్లాలో మద్యం దుకాణాల్లో సగం ఎస్టీలకే రిజర్వ్​ కావడంతో ఎస్టీల పేర దరఖాస్తులు వేసేందుకు వ్యాపారులు స్కెచ్​ వేస్తున్నారు. కొత్తగూడెంలోని ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ ఆఫీస్​లో శుక్రవారం నుంచి వైన్​ షాపులకు దరఖాస్తులను తీసుకోనున్నారు. 

మొత్తం 88 వైన్​ షాపులు.. 

జిల్లాలో ఆరు ఎక్సైజ్​ సర్కిల్స్​ పరిధిలో 88వైన్​ షాపులున్నాయి. వీటికి లాస్ట్​ టైం 5,557 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 111.14కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి గతం కంటే ఎక్కువగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్​ ఆఫీసర్లు భావిస్తున్నారు. జిల్లా షెడ్యూల్డ్​ ఏరియాలో ఉండడంతో మొత్తం 88 షాపుల్లో 44షాపులు ఎస్టీలకు రిజర్వ్​ అయ్యాయి. 

మిగతా వాటిలో  గౌడ్స్​కు 6, ఎస్సీలకు 7, జనరల్​ గా 31షాపులను కేటాయించారు. ఈసారి దరఖాస్తు ఒక్కోటి రూ. 3లక్షలకు పెంచడంతో రూ. 150 నుంచి రూ.200కోట్ల ఆదాయం దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి వస్తుందంటున్నారు. కాగా, జిల్లాలో ప్రతినెలా మద్యం అమ్మకాల ద్వారా దాదాపు రూ. 80 కోట్ల మేర ఆదాయం వస్తోంది. దీంతో షాపులకు మంచి డిమాండ్​ ఉంది. 

ఈ క్రమంలో ఎస్టీలకు కేటాయించిన 44 మద్యం షాపులను గిరిజనుల పేర దరఖాస్తులు వేసేందుకు కొందరు వ్యాపారులు సన్నద్ధం అవుతున్నారు. ఎక్కువ శాతం షాపులకు దరఖాస్తులు బినామీలే వేస్తుండడం గమనార్హం. ఎస్టీలతో పాటు మిగతా కేటగిరీల్లోనూ అదే పరిస్థితి ఉంది. వైన్​ షాపులకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించడంతో వ్యాపారులు జ్యోతిష్యులను సంప్రదించి తమ పేరుబలాలను పరిశీలించుకుంటూ హడావుడి చేస్తున్నారు. 

ఆరు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం..  

కొత్తగూడెంలోని ఎక్సైజ్​సూపరింటెండెంట్​ ఆఫీస్​లో శుక్రవారం నుంచి వైన్​ షాపులకు దరఖాస్తులు తీసుకోనున్నాం. ఆఫీస్​ టైంలో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. రిజర్వ్​ షాపులకు కులం సర్టిఫికెట్​ జత చేయాల్సి ఉంటుంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 3లక్షలు డీడీ కట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని ఆరు సర్కిల్స్​కు గానూ ఆరు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నాం. - జానయ్య, ఎక్సైజ్​సూపరింటెండెంట్​, భద్రాద్రికొత్తగూడెం

ఖమ్మం జిల్లాలో 116 వైన్ షాపులు 

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం జిల్లాలో 116 వైన్ షాపులు ఉన్నాయి. వీటిలో గౌడ కులస్తులకు 18, ఎస్సీలకు 14, ఎస్టీలకు 8 షాపులు రిజర్వ్ చేశారు. ఓపెన్ క్యాటగిరిలో 76 లిక్కర్ షాపులు ఉన్నాయి. జిల్లాలో ఏడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఉండగా, గతేడాది 7,207 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 144.14 కోట్ల ఆదాయం వచ్చింది.

 రెండేండ్ల కింద ఒక్కో దరఖాస్తుకి రూ. 2 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఉండగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ. 3 లక్షలకు పెంచింది. దీంతో అప్లికేషన్లు ద్వారానే ఈ ఏడాది రూ.150 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు.