ఓల్డ్ స్టాక్ కు కొత్త ధర..దోచుకుంటున్న వైన్స్

ఓల్డ్ స్టాక్ కు కొత్త ధర..దోచుకుంటున్న వైన్స్
  • లిక్కర్ ధరలు పెంచిన ప్రభుత్వం
  • ఓల్డ్ స్టాక్ తో దోచుకుంటున్న వైన్స్
  • ఎంఆర్ పీపై రూ.20 నుంచి 100 అదనంగా వసూలు

రంగారెడ్డి జిల్లా, వెలుగు : మందుబాబులు దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం లిక్కర్​ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందో లేదో పాత లిక్కర్​ను కొత్త ధరలకు అమ్మడం స్టార్ట్​ చేశారు షాపుల యజమానులు. పాత లిక్కర్​ను పాత ధరలకు, కొత్త లిక్కర్​ను కొత్త ధరలకు విక్రయించాలని రూల్స్​ చెబుతున్నాయి. మద్యం బాటిళ్లపై ఎంఆర్​పీకి మించి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. కానీ ప్రభుత్వ ప్రకటనను సాకుగా చూపుతూ రూ.20 నుంచి రూ.80 వరకు తీసుకుంటున్నారు.

హైదరాబాద్​లోనే ఎక్కువ..

రాష్ట్రంలో మొత్తం 2216 షాపులు ఉండగా హైదరాబాద్‌‌ జిల్లాలో 173, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 422 దుకాణాలున్నాయి. మొత్తం 595 షాపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. లిక్కర్​ ధరలు పెంచిన తర్వాత సోమవారం డిపోల నుంచి కొత్త స్టాకు ఇవ్వలేదు. మంగళవారం కూడా స్టాక్​ రాకపోవడంతో గ్రేటర్​లోని పలు షాపుల్లో దోపిడీ పర్వం కొనసాగింది.  ప్రశ్నించే వాళ్లు లేకపోవడంతో అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించారు.

కావాలిస్తే తీసుకో..లేదంటే వెళ్లిపో…

‘అదేంది. బాటిల్​పై పాత ధరే ఉంది కదా. ఎక్కువ పైసలు తీస్కుంటున్నరేంది?’ అని ఎవరైనా షాపుల యజమానులను ప్రశ్నిస్తే  ‘మందు కావాలంటే అడిగినంతా ఇచ్చి తీసుకుపో..లేదంటే వెళ్లిపో..ఎక్కువ మాట్లాడొద్దు’ అంటూ సమాధానం ఇవ్వడం కనిపించింది. దాదాపు ప్రతిషాపులో ఇలా జరుగుతున్నా ఎక్కడా ఎక్సైజ్​శాఖ అధికారులు తనిఖీలు కనిపించలేదు.

దొరికితే షాపు సీజ్ చేస్తాం

15 రోజులు లైసెన్స్​ సస్పెండ్​ చేసి రూ.2 లక్షలు ఫైన్​ వేస్తాం. మా దృష్టికి రాలేదు. వస్తే చర్యలు తీసుకుంటాం. పాత లిక్కర్‌‌ను కొత్త ధరలకు అమ్మితే ఊరుకోం. రూల్స్​ బ్రేక్​ చేసే షాపులపై నిఘా పెట్టాం. కొత్త స్టాక్ వచ్చాకే దానిపైన ఉన్న ఎంఆర్​పీకి మాత్రమే అమ్మాలి.  లేదంటే కఠిన చర్యలు తీసకుం టాం. అవసరమైతే షాపులను సీజ్​ చేస్తాం.

‑ వివేకానంద,

ఎక్సైజ్‌‌ డిప్యూటీ కమిషనర్‌‌, హైదరాబాద్​