T20 World Cup 2026: ఇండియాలో ఆడతారా..? ఐదుగురు పేసర్లతో బంగ్లాదేశ్.. టీ20వరల్డ్ కప్‌కు జట్టు ప్రకటన

T20 World Cup 2026: ఇండియాలో ఆడతారా..? ఐదుగురు పేసర్లతో బంగ్లాదేశ్.. టీ20వరల్డ్ కప్‌కు జట్టు ప్రకటన

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం (జనవరి 4) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టుకు లిటన్ దాస్ నాయకత్వం వహించనున్నాడు. మహమ్మద్ సైఫ్ హసన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐపీఎల్ నుంచి తప్పించిన ముస్తాఫిజుర్ రెహమాన్ కు బంగ్లా స్క్వాడ్ లో స్థానం దక్కింది. చాలా టీ20 లకు దూరమైన తస్కిన్ అహ్మద్ వరల్డ్ కప్ లో చోటు దక్కించుకున్నాడు. ఆశ్చర్యకరంగా వికెట్ కీపర్ బ్యాటర్ జేకర్ ఆలీకి స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. మాజీ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో గత సీజన్ లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో సెంచరీ కొట్టినా సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు.  

కెప్టెన్ లిటన్ దాస్ తో పాటు తాంజిద్ హసన్, మహ్మద్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, ఖాజీ నూరుల్ హసన్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, మహమ్మద్ షైఫుద్దీన్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మహేది హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ ను వెస్టిండీస్ తో ఆడుతుంది.    

బంగ్లా మ్యాచ్ లు ఇండియాలో జరుగుతాయా..?
 
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇటలీ, నేపాల్, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లతో పాటు బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది. మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్ ల్లో మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ లను శ్రీలంకలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై అటు ఐసీసీ.. ఇటు బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

2026 టీ20 ప్రపంచ కప్ కు బంగ్లాదేశ్ జట్టు:

లిట్టన్ దాస్ (కెప్టెన్), సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, మహ్మద్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్ పట్వారీ, నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, మహమ్మద్ షైఫుద్దీన్, షోరీఫుల్ ఇస్లాం