సుప్రీంకోర్టు విచారణలపై సీజేఐ కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు విచారణలపై  సీజేఐ కీలక నిర్ణయం

సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇకపై ప్రత్యక్షంగా చూడవచ్చు. దీనిపై సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370  కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు. 

సీజేఐ జస్టిస్ లలిత్ అధ్యక్షతన జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో సుప్రీంకోర్టు విచారణలను లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఫస్ట్ రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను ప్రత్యక్ష ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతానికి యూట్యూబ్లో టెలికాస్ట్ చేయనున్నారు. ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీంకోర్టు.. సొంత ప్లాట్ ఫాం తయారుచేసుకోనున్నట్లు సమాచారం.

గత అగస్ట్ లోనే మొదటిసారిగా సుప్రీం కార్యక్రమాలను లైవ్ గా ప్రసారం చేశారు. అప్పటి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సందర్భంగా ప్రత్యక్షప్రసారం చేశారు. 2018లోనే కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.