అర్హత ఉన్నా 30 శాతం మందికి రుణమాఫీ కాలే: హరీశ్​రావు

అర్హత ఉన్నా 30 శాతం మందికి రుణమాఫీ కాలే: హరీశ్​రావు
  • విద్యుత్​శాఖ తీవ్ర సంక్షోభంలో ఉంది: హరీశ్​రావు
  • స్మితా సబర్వాల్​ వ్యాఖ్యలతో ఏకీభవించనని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: తమ అధ్యయనం ప్రకారం అర్హులైన 30 నుంచి 40 శాతం మంది రైతులకు లక్షలోపు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్​ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి పీఎం కిసాన్​ యోజనతో లింక్​ పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం రైతును గుర్తించాలి తప్ప.. కుటుంబంతో పనేమిటి? అని ప్రశ్నించారు. రేషన్ కార్డు నిబంధన లేదని కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఐఏఎస్​లో దివ్యాంగులకు రిజర్వేషన్లపై స్మితా సబర్వాల్​ చేసిన కామెంట్లతో తాను ఏకీభవించబోనని చెప్పారు.

 సోమవారం హరీశ్​రావు అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని అన్నారు. బీఆర్ఎస్​ తట్టిలేపితేగానీ సర్కారు లేవట్లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులు వస్తున్నా.. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడంతోనే అనేక పథకాలపై ప్రభావం పడిందన్నారు.  రోజువారీ సమస్యలు కూడా తీర్చడం లేదు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులున్నాయని, కనీసం రోజువారీ సమస్యలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదని హరీశ్​రావు పేర్కొన్నారు. 

విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభంలో ఉందని, కరెంటు కోతలకు విచిత్ర కారణాలు చెబుతున్నారని అన్నారు.  కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద తులం బంగారం లేదని, కొత్తగా చెక్ లు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారని, దాదాపు లక్ష చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. రూ.2,500 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ బిల్స్  పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా జీతం రాలేదని తెలిపారు.