
- వైరా సభలో సీఎం అనౌన్స్ చేస్తరు: మంత్రి తుమ్మల
- మూడో విడతలో 6 లక్షల మందికి రూ.6 వేల కోట్లు మాఫీ
- సాంకేతిక లోపాలుంటే సరిదిద్దుతం.. పంటల బీమా అమలు చేస్తం
- రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ చేస్తున్నం.. అందుబాటులో ఎరువులు
- రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు : రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించనున్న సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. మూడో విడతలో 6 లక్షల మంది రైతులకు దాదాపు రూ.6 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయనున్నట్టు చెప్పారు.
మంగళవారం సెక్రటేరియెట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడారు. ‘‘వరంగల్ డిక్లరేషన్‌లో మొదటి పంటకాలానికే రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశాం. ఆ మేరకు తమ ప్రభుత్వం రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నది. మూడో విడత కూడా ఈ నెలలో చేయాలని నిర్ణయించాం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాల విడుదల సభలో మూడో విడత రూ.2 లక్షల వరకు రుణమాఫీని ప్రారంభిస్తారు” అని వివరించారు.
వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగానే..
వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఎన్ని కష్టాలున్నా ఈ అంశంలో ముందుకెళ్తున్నామని చెప్పారు. వాస్తవానికి రాహుల్ గాంధీ వరంగల్‌లో ప్రకటన చేసిన మే నెల నుంచే రుణమాఫీ చేయాల్సి ఉందని, కానీ రైతులను దృష్టిలో పెట్టుకుని ఐదేండ్లలో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పారు. జులై 18న తొలివిడతగా రూ.లక్షలోపు, జులై 30న రెండో విడతగా రూ.లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. రెండు విడతల్లో కలిపి మెుత్తం 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12, 224 కోట్లు జమ చేశామన్నారు.
సాంకేతిక లోపాలు సరిదిద్ది మాఫీచేస్తం..
క్రాప్ లోన్స్ మాఫీలో బ్యాంకుల తప్పిదం, ఎర్రర్స్, ఆధార్ నంబర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్.. ఇలా పలు సాంకేతిక కారణాలతో రెండు విడతల్లో 30 వేల క్రాప్‌లోన్ అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ పొరపాట్లన్నీ సరి చేసి, అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. మొదటి విడతలో 17 వేల అకౌంట్లు ఎర్రర్ రాగా.. వాటిలో ఇప్పటివరకూ 10 వేల మంది రైతుల అకౌంట్లలో మిస్టేక్స్సరిచేసి, డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు
రైతాంగం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దురాలోచన తగదని ప్రతిపక్షాలకు మంత్రి తుమ్మల హితవు పలికారు. రుణమాఫీకి అడ్డంకులు సృష్టించి, చిల్లరమాటలతో రైతుల మనోభావాలను దెబ్బ తీయవద్దని సూచించారు. రాజకీయ విమర్శలు దురదృష్టకరమనీ, ప్రక్రియ పూర్తికాకముందే విమర్శలు చేయవద్దని అన్నారు. ‘‘గతంలో కేవలం మన్మోహన్సింగ్ప్రభుత్వం మాత్రమే ఒకేసారి రుణాలు మాఫీచేసింది.
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.25 వేల చొప్పున 4 విడుతల్లో లక్ష మాఫీ చేసింది. నాలుగేండ్లు పట్టినా అవి రైతులకు ఎటూ ఉపయోగపడలేదు. వడ్డీలకే సరిపోలేదు. 2018 ఎన్నికల్లో లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి 2023 ఎన్నికలకు ముందు వరకు ఆగారు. ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు బేరం పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు మాఫీ చేశారు” అని పేర్కొన్నారు. అందులోనూ రూ.1400 కోట్లు టెక్నికల్ ఇబ్బందులతో వెనక్కు వచ్చాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చి, అన్నదాతలను పొట్టనపెట్టుకున్నదని మండిపడ్డారు.
పంటలకు అనుకూలంగా వాతావరణం
వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండటం వల్ల వ్యవసాయానికి మంచి పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తుమ్మల అన్నారు. ఈసారి వరణుడు కరుణించాడని, చాలా రోజుల తర్వాత కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నిండాయని హర్షం వ్యక్తం చేశారు. గోదావరిలో కొంత లోటు ఉందని, ఇంకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నదన్నారు. అన్ని పంటలు వేసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రం ఈ నెల ఎరువుల కోటా పంపలే..
రైతులకు ఎరువులు, విత్తనాలు లోటు లేకుండా సరఫరా చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. కేంద్రం కొంత అనాసక్తిగా ఉన్నా ఎరువులకు ఇబ్బంది లేదన్నారు. రాష్ట్రానికి ఈ నెలలో రావాల్సిన కోటా యూరియా, డీఏపీ కేంద్రం ఇవ్వలేదని మంత్రి వెల్లడించారు. ‘‘యూరియా ఎక్స్‌పోర్ట్‌లో జాప్యం జరుగుతున్నది. పూర్తిస్థాయిలో ఎరువులు రాలేదు. యూరియా, డీఏపీ ఇంకా రావాల్సి ఉంది. గత నెలలో కేంద్రానికి లెటర్ రాశాం. వెంటనే పంపించాలని కోరాం” అని మంత్రి వెల్లడించారు.
పంటల బీమా అమలు చేస్తం
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రతి రైతుకు లాభం చేకూరేలా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని చెప్పారు. పంటల బీమా ఫైనల్ స్టేజ్‌లో ఉందని అన్నారు. గతంలో బ్యాంకులో అప్పు తీసుకున్న రైతుకే ప్రీమియం ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వమే ప్రీమియం కట్టి ఏ రైతుకు నష్టం వచ్చినా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
గత ఐదేండ్లలో సాగు చేయని భూములకు రూ.25వేల కోట్ల రైతుబంధు వెళ్లిందని అన్నారు. ఆలస్యమైనా రైతు భరోసా అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతు భరోసాపై మూడు, నాలుగు జిల్లాలో అభిప్రాయ సేకరణ కొనసాగుతున్నదని వివరించారు. సాగులోలేని భూములకు పొందిన రైతుబంధు రికవరీ చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.