రాష్ట్ర ఇన్​కం మొత్తం లోన్లు కట్టడానికే: 2 నెలల్లోనే రూ.16,717 కోట్ల అప్పు

రాష్ట్ర ఇన్​కం మొత్తం లోన్లు కట్టడానికే: 2 నెలల్లోనే రూ.16,717 కోట్ల అప్పు

ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.43,937 కోట్లు లోన్లు
 ఇందులో సగం పాత అప్పుల కిస్తీలు, మిత్తీలకే చెల్లింపు
ఇట్లయితే రాష్ట్ర ఇన్​కం మొత్తం లోన్లు కట్టడానికే సరిపోదని ఎక్స్​పర్టుల హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు గత రెండు నెలల్లోనే ఏకంగా రూ.16,717 కోట్లు అప్పులు చేసింది. ఎన్నడూ లేనట్టుగా డిసెంబర్​ ఒక్క నెలలోనే రూ.9,897 కోట్లు తీసుకోగా, జనవరిలో రూ.6,820 కోట్లు లోన్లు తీసుకుంది. వీటితో కలిపి ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్​లో రాష్ట్రం తీసుకున్న అప్పులు రూ.43,937 కోట్లకు చేరాయి. ఇది బడ్జెట్లో అనుకున్న దానికంటే 32 శాతం ఎక్కువ కావడం గమనార్హం. కంప్ట్రోలర్​అండ్​ అడిట్​ జనరల్​(కాగ్) లేటెస్ట్​రిపోర్ట్​లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత రెండు నెలల్లో రాష్ట్రానికి ట్యాక్స్​ల ద్వారా వచ్చిన ఇన్​కం కంటే.. తీసుకున్న అప్పులే ఎక్కువగా ఉన్నట్టు కాగ్​ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. డిసెంబర్, జనవరి 2 నెలలు కలిపి రాష్ట్రానికి సమకూరిన ట్యాక్స్​ ఇన్​కం రూ.15,519 కోట్లే. ఇంకా ఫైనాన్షియల్​ ఇయర్​లో మిగిలిన ఫిబ్రవరి, మార్చి నెలలనూ కలిపితే.. రాష్ట్రం ఈ ఒక్క ఏడాది చేసే అప్పులు రూ.50 వేల కోట్లు దాటొచ్చని ఎక్స్​పర్టులు చెప్తున్నారు.  కాగ్​రిపోర్టు ​ప్రకారం.. ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్​లో రాష్ట్రానికి రూ. లక్షా 43 వేల కోట్ల రాబడి అంచనా వేయగా.. జనవరి నాటికి రూ.74 వేల 990 కోట్లే  వచ్చాయి. ఇందులో జీఎస్టీ వసూళ్లు రూ.20 వేల కోట్లు, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్లతో రూ.3,358 కోట్లు, సేల్స్​ట్యాక్స్​రూ.16,416 కోట్లు, ఎక్సైజ్ తో రూ.11,443 కోట్లు సమకూరాయి.

అప్పులు కట్టేందుకే మళ్లీ అప్పులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సర్కారు చేసిన అప్పుల్లో సగం పాత అప్పుల కిస్తీలు, మిత్తిలకే కట్టారు. సర్కారు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.20,855 కోట్లను అప్పుల కిస్తీలు, వడ్డీకి చెల్లించింది. ఇందులో మిత్తిలకే రూ.12,735 కోట్లు కట్టగా కిస్తీలకు రూ.8,120 కోట్లు చెల్లించారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రానికి వచ్చే ఇన్​కం మొత్తం అప్పుల కిస్తీలు, వడ్డీలకే సరిపోదని ఎక్స్​పర్ట్స్​హెచ్చరిస్తున్నరు.