
- కేసులో రెండో నిందితుడిగా దేవరాజ్ రామచందర్
- 15 రోజులు గడిచినా దొరకని ఆచూకీ
- మంగళవారంతో ముగిసిన నిందితుల కస్టడీ.. రిమాండ్‌కు తరలింపు
- బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన లాయర్లు, నేడు విచారణ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సెక్రటరీ దేవరాజ్ రామచందర్‌పై లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ) జారీ అయ్యింది. దేశం విడిచి పారిపోకుండా ఎయిర్ పోర్టులు, సీ పోర్టులను సీఐడీ అప్రమత్తం చేసింది. దేవరాజ్ కోసం రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నది. హెచ్‌సీఏ అధ్యక్షుడి ఎన్నిక సహా నిధుల దుర్వినియోగం కేసులో అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ప్రధాన నిందితుడు కాగా.. దేవరాజ్ రామచందర్ రెండో నిందితుడిగా ఉన్నాడు.
ఈ కేసులో జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె సహా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్‌ను ఈ నెల 9న సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టుల విషయం ముందుగానే తెలియడంతో దేవరాజ్ పారిపోయాడు.
15 రోజులుగా జాడ లేని దేవరాజ్
సికింద్రాబాద్ సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీలోని దేవరాజ్ నివాసం సహా పలు అనుమానిత ప్రాంతాల్లో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. దేవరాజ్ మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో.. ఆయన కుటుంబ సభ్యులు సహా హెచ్‌సీఏలో అనుమానితులపై సీఐడీ నిఘా పెట్టింది. 15 రోజులు గడిచినప్పటికీ దేవరాజ్ గురించి జాడ తెలియలేదు. సీఐడీకి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో దేశం విడిచి పారిపోకుండా ఉండేలా సీఐడీ ఎల్‌వోసీ జారీ చేసింది.
మరోవైపు ముందస్తు బెయిల్ కోసం దేవరాజ్ ప్రయత్నిస్తే కౌంటర్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాల ఫోర్జరీకి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా ప్రశ్నించినట్టు సమాచారం.
ముగిసిన కస్టడీ, ఐదుగురు నిందితులు జైలుకు..
జగన్‌మోహన్ రావు సహా ఐదుగురు నిందితుల రిమాండ్ మంగళవారంతో ముగిసింది. కోర్టు అనుమతితో గురువారం నుంచి మంగళవారం వరకు ఆరు రోజుల పాటు సీఐడీ కస్టడీకి తీసుకుని విచారించింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో జగన్‌మోహన్ రావు ఎన్నిక సహా బీసీసీఐ నుంచి వచ్చిన గ్రాంట్లు, హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించింది. అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రావు పోటీ చేసేందుకు ఎవరెవరు సహకరించారు? వారికి ఎలాంటి లబ్ధి చేకూరింది? అనే కోణంలో సీఐడీ దర్యాప్తు చేస్తున్నది.
ఆరు రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం మధ్యాహ్నం నిందితులను మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచింది. కవితను చంచల్‌గూడ మహిళా జైలుకు, జగన్‌మోహన్ రావు సహా నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించింది. మరోవైపు నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై బుధవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఐఏఎస్, ఐపీఎస్‌ల ఓటు హక్కు గురించి ఊహాగానాలు వద్దు
హెచ్‌సీఏ కేసులో చీటింగ్, అధికార దుర్వినియోగం, డాక్యుమెంట్స్ ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు సంబంధించిన దర్యాప్తు జరుగుతోంది. హెచ్‌సీఏ ఎన్నికల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తమ వ్యక్తిగత హోదాలో ఓటు వేసే హక్కు లేదు. క్లబ్, సంస్థాగత అంశాలతో ముడిపడి ఉన్న అధికారాలు, ఎన్నికలలో ఐఏఎస్, ఐపీఎస్‌ల ఓటు హక్కుల గురించి ఊహాగానాలు చేయడం అనవసరం. ఏ అధికారికి తన వ్యక్తిగత హోదాలో ఓటు వేసే హక్కు లేదు. అవసరమైతే దర్యాప్తు వివరాలను సీఐడీ ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది.- చారు సిన్హా, సీఐడీ చీఫ్