యాదాద్రిలో లోకల్ రిజర్వేషన్లు ఖరారు..ప్రకటించిన ఆఫీసర్లు

యాదాద్రిలో లోకల్ రిజర్వేషన్లు ఖరారు..ప్రకటించిన ఆఫీసర్లు
  • ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో నో చేంజ్​ 
  • రిజర్వేషన్లు 50 శాతం పరిమితి..
  • ఒక్కో మండలంలో..  బీసీలకు 2 నుంచి పది వరకూ తగ్గుదల

యాదాద్రి, వెలుగు:  రొటేషన్​ కారణంగా పంచాయతీ రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకున్నాయి.  2018 పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల రిజర్వేషన్లకు, ప్రస్తుత రిజర్వేషన్లకు మధ్య వత్యాసం నెలకొంది. రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం కావడంతో బీసీలు పెద్ద మొత్తంలో సీట్లను కోల్పోయారు. చట్టపరంగా బీసీలు కోల్పోయిన సీట్లను రాజకీయ పార్టీలు అన్ రిజర్వ్​డ్ స్థానాల్లో కేటాయించే అవకాశం ఉంది. 

రిజర్వేషన్లపై జీవో 46 రిలీజ్

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం జీవో నెంబర్​ 46 రిలీజ్​ చేసింది. ఈ జీవో ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా కేటాయింపు ఉంటుంది. 2011 జనగణనతో పాటు గతేడాదిలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి సర్వే ఆధారంగా రిజర్వేషన్ల కేటాయించాలని జీవోలో పేర్కొంది. దీంతో రిజర్వేషన్ల కసరత్తును జిల్లాఫీసర్లు వేగం పెంచారు. 

బీసీలకు తగ్గుదల..  పెరిగిన అన్​ రిజర్వ్​డ్​

 2018 పంచాయతీరాజ్​ చట్టంలో రిజర్వేషన్లలో మార్పు లేకుండా వరుసగా రెండుమార్లు  కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీన్ని సవరించింది. దీంతో 2018 ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్లలో ఎక్కువ శాతం మారిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్​లో కేటాయించిన రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సర్పంచ్​ స్థానాల సంఖ్యలో తేడా లేకున్నా.. కొన్ని గ్రామాల రిజర్వేషన్లు చేంజ్​ అయ్యాయి. 

వార్డుల రిజర్వేషన్లలో ఎక్కువగా మార్పులు చోటు చేసుకున్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా పరిమితం అయ్యాయి. దీంతో బీసీలకు గతంలో మాదిరిగా 23 శాతానికి రిజర్వేషన్లు తగ్గిపోయాయి. దీంతో ఒక్కో మండలంలో బీసీలకు రెండు నుంచి పది వరకూ సర్పంచ్​ స్థానాలు తగ్గిపోయాయి. కాగా వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్​లు, వార్డు మెంబర్లు పూర్తిగా ఆ  సామాజిక వర్గానికే కేటాయించారు.

 ముందుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్​ ప్రక్రియ ముగిసిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్ల ఖరారు చేశారు. ఆయా కేటగిరిల్లో రిజర్వేషన్ల ఖరారు కావడంతో మహిళలకు 50 శాతం కేటాయించాల్సి ఉంటుంది. లాటరీ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లను ఆదివారం కేటాయిస్తారు. చట్ట ప్రకారం బీసీలకు సీట్లు తగ్గినా. పార్టీల పరంగా 42 శాతం సీట్లు కేటాయించే అవకాశం ఉంది. 

యాదాద్రిలో బీసీలకు 101

యాదాద్రి జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు, 3704 వార్డులు ఉన్నాయి.  ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం వంద శాతం ఎస్టీలు ఉన్న సంస్థాన్​ నారాయణపురం, తుర్కపల్లి, బొమ్మల రామారం మండాలాల్లోని 36 పంచాయతీలు, 130 వార్డులను రిజర్వ్​ చేశారు.  మరో 13 పంచాయతీలు, 235 వార్డులను రిజర్వ్​ చేశారు. ఎస్సీలకు 74  పంచాయతీలతో పాటు 636 వార్డులను రిజర్వ్​ చేశారు.  

.బీసీలకు సెప్టెంబర్​లో 164 పంచాయతీలు, 1528 వార్డులను రిజర్వ్​ చేయగా ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయింది.  101 పంచాయతీలు, 880 వరకూ వార్డులు రిజర్వ్​చేసినట్టుగా తెలుస్తోంది. బీసీలకు పంచాయతీలు తగ్గడంతో అన్​ రిజర్వ్​ పంచాయతీల సంఖ్య  144నుంచి 224, వార్డుల సంఖ్య 1823కు పెరిగిపోయింది.