- ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తుకు సర్కారు చాన్స్
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త (స్పౌస్)లకు కూడా ఆప్షన్
- కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయాలు
హైదరాబాద్ , వెలుగు: 317 జీవోతో అన్యాయం జరిగిన ఉద్యోగులు లోకల్ స్టేటస్ ఆధారంగా ఈ నెల 14 నుంచి 30 వరకు అప్లై చేసుకునేందుకు సర్కారు అవకాశం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త (స్పౌస్)లకు కూడా ఆప్షన్ , మల్టిపుల్ అప్లికేషన్లకు చాన్స్ కల్పించింది. బుధవారం సెక్రటేరియెట్ లో 317, 46 జీవోలపై వేసిన కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది.
చైర్మన్ దామోదర రాజనర్సింహ, మెంబర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు రెండు గం టల పాటు చర్చించారు. మరో మెంబర్ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో ఉన్నందున ఈ మీటింగ్ కు హాజరుకాలేదు. కాగా, ఈ మీటింగ్ లో కేబినెట్సబ్కమిటీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ రెండు జీవోల బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయగా.. అందులో కొత్తగా లోకల్ స్టేటస్ ( స్థానికత) ను చేర్చారు. ఇప్పటివరకూ 12,011 దరఖాస్తులు వచ్చాయని, వీటి రీ -వెరిఫికేషన్ కు అవకాశం కల్పించినట్టు రాజనర్సింహ తెలిపారు.
ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇస్తున్నామని చెప్పారు. సబ్ కమిటీ సమావేశంలో పీఆర్సీ చైర్మన్ శివశంకర్, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా, సాధ్యమైనంత త్వరలో ఈ జీవో బాధితులకు న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, 317 జీవో కమిటీ అధ్యక్షుడు విజయ్, నాగేశ్వరావు, మధుసూదన్ రెడ్డి, సందీప్ తెలిపారు.