లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా? కాసేపట్లో కేబినెట్ భేటీ.. 

లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా? కాసేపట్లో కేబినెట్ భేటీ.. 

లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా.. ఎటువంటి సడలింపులు ఇవ్వాలి.. అనే వాటిపై నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్, వానాకాలం పంట సీజన్‌పై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్ మినహాయింపులు అమలులో ఉన్నాయి. పొద్దంతా మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. నైట్ కర్ఫ్యూ ఏ టైం నుంచి అమలు చేయాలన్నదానిపై కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే మునుపటి లాగానే... ఇంకొన్ని రోజులు సినిమా టాకీస్‌లు, పబ్బులు, క్లబ్బులు, జిమ్ములు, పార్కులు, రెస్టారెంట్లు బంద్ ఉంచాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. 

రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, కరోనా కేసుల స్టేటస్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతు బంధు, వానాకాలం పంటల సీజన్, లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. థర్డ్ వేవ్ వస్తుందన్న సూచనతో.. ఎదుర్కోవాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నోడల్ హాస్పిటళ్ల ఎంపిక, కల్పించాల్సిన సౌకర్యాలపై కూడా చర్చించనున్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కోలుకునేలా చేసేందుకు ఏం చేయాలన్న దానిపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు.

ఉద్యోగుల పీఆర్సీ అంశంపైనా కేబినెట్లో డిస్కస్ చేసే చాన్స్ కనిపిస్తోంది. వానాకాలం పంటల సీజన్ ప్రారంభం కావడంతో.. రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ.. కల్తీ విత్తనాలను అరికట్టే చర్యలు.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత, వ్యవసాయ అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, అవి పనిచేస్తున్న తీరు, సకాలంలో వాటిని పూర్తిచేసేందుకు వెంటనే ఏం చేయాలి, వానాకాలంలో ఏ ప్రాజెక్టు కింద ఎంతమేర ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలన్నదానిపై సీఎం రివ్యూ చేయనున్నారు.