ఇస్లామాబాద్: పాకిస్తాన్‌పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రమైంది. ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ఇంధన ధరలతో ఆ దేశం సతమతమవుతున్నది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 'స్మార్ట్ లాక్‌డౌన్' తరహా ఆంక్షలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరాలో అంతరాయం కలగడంతో ఇంధనం, విద్యుత్తును ఆదా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
మంగళవారం ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగులో స్మార్ట్ లాక్‌డౌన్‌కు సంబంధించిన 'ఎనర్జీ కంట్రోల్ ప్లాన్'కు ఆమోదం లభించింది. మంగళవారం నుంచే ఈ కొత్త నిబంధనలు అధికారికంగా అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏమిటీ స్మార్ట్ లాక్‌డౌన్..?
స్మార్ట్ లాక్‌డౌన్ అంటే సాధారణ లాక్డౌన్లాగా నగరాన్ని పూర్తిగా మూసివేయకుండా కేవలం వ్యాపార, సామాజిక కార్యకలాపాల సమయాన్ని తగ్గిస్తారు. రాత్రిపూట విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తారు. దేశవ్యాప్తంగా మాల్స్, మార్కెట్లు, ఇతర వ్యాపారాలన్ని రాత్రి 8:00 గంటలకల్లా మూసివేయాలి. రెస్టారెంట్లు, బేకరీలు రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.
ఫంక్షన్ హాళ్లలో లేదా ఇండ్లలో జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు రాత్రి 10:00 గంటల తర్వాత నిర్వహించకూడదు. పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, పీవోకే వంటి ప్రాంతాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయి. రూల్స్ ఉల్లంఘించే వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ప్రభుత్వం ఆదేశించింది.
వేటికి మినహాయింపులంటే..
ప్రజలకు అత్యవసర సేవల్లో ఆటంకం కలగకుండా ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. మెడికల్ స్టోర్లు, ఫార్మసీలు, ఆసుపత్రులు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అదనంగా.. గిల్గిట్, ముజఫరాబాద్‌లలో ప్రజల రవాణా భారాన్ని తగ్గించేందుకు ఒక నెల పాటు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు.
