ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఏం తినాలన్నా, ఎవరిని కలవాలన్నా, బయటకు వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఏ రూపంలో ఎవరి ద్వారా ఎక్కడి నుంచి వైరస్ అంటుకుంటుందోనన్న భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్వీయ నిర్బంధం పాటించాలని, బయటకు వెళ్లినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. హోం క్వారంటైన్, లాక్డౌన్, ఐసోలేషన్తో పాటు కరోనాకు సంబంధించిన అనేక విషయాలను ప్రభుత్వం మీడియా ద్వారా ప్రజలకు చెబుతూనే ఉంది. లాక్డౌన్ నిబంధనలు నగరాలు, పట్టణాలతో పోలిస్తే, గ్రామాల్లో కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. పల్లె జనం రూల్స్ పక్కాగా ఫాలో అవుతున్నారు.
ప్రతీ గ్రామానికి చెక్పోస్ట్..
ఖమ్మం జిల్లాలోని గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ మొదలైన సమయంలో గ్రామ శివార్లలో రోడ్లను బ్లాక్ చేశారు. బయట నుంచి కొత్త వారెవరూ తమ గ్రామంలోకి ప్రవేశించకుండా ఇలాటి ఏర్పాట్లు చేశారు. కానీ దీని వల్ల అత్యవసర సమయాల్లో 108 వాహనం, గ్యాస్ డెలివరీ, పోలీస్ వాహనాలు కూడా రావడానికి ఇబ్బంది కావడంతో కంచెలను తొలగించి చెక్ పోస్టుల వంటివి ఏర్పాటు చేసుకున్నారు. కొత్త వారెవరైనా వస్తే ముందుగా ఆ చెక్పోస్టుల దగ్గర వివరాలు నమోదు చేసుకొని ఊళ్లలోకి రావాలి. మరోవైపు ప్రతి గ్రామంలో ఆఫీసర్లు ఏఎన్ఎం, ఆశావర్కర్, గ్రామ కార్యదర్శితో కలిపి టీమ్ను ఏర్పాటు చేశారు. కొత్త వారు వస్తే వెంటనే వారి వివరాలు సేకరించడం, విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ప్రతి పూటా ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయడం, హోం క్వారంటైన్లో ఉన్న వారు అది పాటిస్తున్నారా లేదా అనేది గమనించడం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో కరోనాపై జనాలకు పూర్తి అవగాహన కల్పించినట్టయింది. ఆఫీసర్లకు తెలియకుండా ఎవరైనా గ్రామాల్లోకి బయట ఊర్ల నుంచి వస్తే వారి సమాచారాన్ని గ్రామస్తులే అధికారులకు చేరవేస్తున్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో తప్పించి గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు బ్రేక్ వేయగలిగారు.
పనుల్లో జాగ్రత్తలు..
లాక్ డౌన్ కారణంగా పట్టణాల్లో, నగరాల్లో అన్ని పనులకు బ్రేక్ పడింది. కానీ పల్లెల్లో మాత్రం లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూనే వ్యవసాయ, ఇతర పనులు చేసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ నిబంధనను పాటిస్తూనే మిర్చి తోటలను ఏరుతున్నారు. ఊర్లోని వ్యక్తిగత అవసరాలకు మట్టి తోలించుకోవడం, పశువులను మేపడం, వరి పొలాలను కోయించడం, కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడం, ఎండు మిర్చిలో తాలు కాయలను కూలీలతో ఏరించడం, ఇలా అన్ని పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి కావడంపై కూడా గ్రామాల్లో డప్పు చాటింపు వేయించడంతో అది కూడా అమలు జరుగుతోంది. గ్రామాల్లో లాక్ డౌన్ అమలవుతున్న తీరు అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది. పట్టణాల కంటే గ్రామ ప్రజల్లోనే కరోనాపై చైతన్యం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.

