భూపాలపల్లి వైపు మిడతలు?

భూపాలపల్లి వైపు మిడతలు?

భూపాలపల్లి, గోదావరిఖని, వెలుగుమహారాష్ట్ర నుంచి వస్తున్న మిడతల దండు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గాలివాటం అనుకూలంగా మారితే.. జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాలకు ఇవి గంటల వ్యవధిలోనే  చేరుతాయని అధికారులు అంటున్నారు. శుక్రవారం జిల్లాలో అక్కడక్కడా మిడతలు కన్పించినట్లు ఫొటోలు సైతం రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మిడతల దాడి జరిగితే ఎదుర్కోవడానికి అధికారులంతా రెడీగా ఉన్నారని కలెక్టర్ అబ్దుల్ అజీం ప్రకటించారు. మహారాష్ట్రలోని నాగ్​పూర్ ప్రాంతంలో మిడతల గుంపులున్నట్లు సమాచారం అందింది. నాగ్​పూర్ నుంచి దక్షిణం వైపు గాలి వీస్తే లక్షలాది మిడతలు జిల్లాలోకి ప్రవేశించవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. మిడతల దండు కదలికల సమాచారం, వాటిని ఎదుర్కొనేందుకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.మిడతల దండు కదలికల సమాచారం, వాటిని ఎదుర్కొనేందుకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిడతలు మన రాష్ట్రానికి వస్తే ముందుగా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై, తర్వాత భూపాలపల్లి జిల్లాపై ప్రభావం ఉంటుందని ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్‌‌‌‌లకు హెచ్చరికలు వచ్చాయి.

రామగుండానికి కమిటీ సభ్యులు

మిడతలను ఎదుర్కొనేందుకు భూపాలపల్లి జిల్లా ఎస్పీ,  అడిషనల్ కలెక్టర్, వ్యవసాయ అధికారి, అగ్నిమాపక శాఖ అధికారి నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీ, వ్యవసాయ శాఖ ఏడీ, కాటారం డీఎస్పీ ఆధ్వర్యంలో మండల స్థాయి కమిటీ, సర్పంచ్, వీఆర్ఓ, పంచాయతీ సెక్రెటరీలతో గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ అజీం ముందస్తు ఆదేశాలు జారీచేశారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న మహదేవపూర్, పలిమెల మండలాల్లో గ్రామ స్థాయి కమిటీలను కలెక్టర్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.

బెంగళూరు నుంచి డ్రోన్లు తెప్పిస్తున్నం 

‘‘భూపాలపల్లి జిల్లాలోకి మిడతలు ప్రవేశించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు అందాయి. బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా డ్రోన్లను తెప్పిస్తున్నాం. వెయ్యి లీటర్ల పురుగు మందులను సిద్ధం చేశాం. జిల్లా కమిటీలు వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రైతులు భయపడాల్సిన అవసరం లేదు’’ అని భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ అజీం తెలిపారు.

ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా నిఘా  

మిడతల దండు ప్రయాణాన్ని అంచనా వేసి, వాటిని అడ్డుకునే చర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, అగ్రికల్చర్ వర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్.జె.రహమాన్, వరంగల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతితో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు శుక్రవారం రామగుండం ఎన్టీపీసీకి చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌‌‌‌ సిక్తా పట్నాయక్‌‌‌‌ను కలిశారు. మిడతల దండు నివారణకు అవసరమైన ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంచేశామని వారు తెలిపారు. మిడతల దండు గాలివాటంగా ప్రయాణిస్తుందని, ఒకవేళ గాలి దక్షిణం వైపు మళ్లితే ఛత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వైపు రావచ్చని వారు చర్చించారు. కమిటీ సభ్యులు హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షణకు వెళ్లారు.