లోక్​సభ ఎన్నికల తీర్పు తెలంగాణకు మలుపు కావాలె

లోక్​సభ ఎన్నికల తీర్పు తెలంగాణకు మలుపు కావాలె

కొత్త రాష్ట్రం  తెచ్చుకొని ఓ కుటుంబపార్టీకి పదేండ్లు అప్పగించాం తప్ప, రాష్ట్రం సాధించుకున్న సార్థకత లేకుండాపోయింది. అందుకే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపించారు. దశాబ్దాల తరబడి ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ పోరాడింది. వచ్చిన తెలంగాణ పదేండ్లు తెలంగాణ ముసుగేసుకొని పాలించిన పాలనలో అనర్థాలను చవిచూసింది.  ఇపుడు లోక్​సభ ఎన్నికలు వచ్చాయి. ఆ పార్టీని ప్రజలు గుర్తిస్తున్న దాఖాలాలు ఏమీ లేవు. రేపు తెలంగాణ ప్రజలు 17 మంది లోక్​సభ సభ్యులను ఎన్నుకోబోతున్నారు. పోటీలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా కాంగ్రెస్​, బీజేపీలే మిగిలినాయి. కాబట్టి, ఉన్న 17 స్థానాల్లో 16 స్థానాలు ఈ రెండుపార్టీలే గెలవబోతున్నాయనేది ఇప్పటికే రూఢీ అవుతున్నది. పదేండ్ల విధ్వంసం నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత ఇకపై ఆ రెండు పార్టీలపైనే ఉండనుంది. 

కాంగ్రెస్​, బీజేపీలు జాతీయ స్థాయిలో వైరుధ్య పార్టీలే కావచ్చు. కానీ, తెలంగాణలో అవి బీఆర్​ఎస్ ​ ఉమ్మడిశత్రువుగా పోరాడి బలపడిన పార్టీలే. బీఆర్​ఎస్​ను ఎవరు ఓడించగలిగితే ప్రజలు వారినే గెలిపిస్తూవచ్చారు. గత మూడేళ్లుగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణలు. కాంగ్రెస్​, బీజేపీ రాజకీయ వైరుధ్యం ఢిల్లీకే పరిమితం చేసుకొని, గెలిచిన రెండు పార్టీల అభ్యర్థులు తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తేగానీ, బీఆర్​ఎస్​ చేసిపోయిన విధ్వంసం నుంచి తెలంగాణ పున:నిర్మాణం సాధ్యం కాదు.

పదేండ్లు ప్రజల సెంటిమెంటే పట్టలే​.. 

కేసీఆర్​ తెలంగాణ సెంటిమెంట్​ను సైతం తనకోసం వాడుకున్నాడు తప్ప, ప్రజల సెంటిమెంట్​ను గౌరవించడానికి ఆయన ఏనాడూ ఇష్టపడలేదు. తెలంగాణ ప్రజలు అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా కోరుకున్నారు. కానీ దాన్ని అధికారిక రాష్ట్ర గీతం చేయడానికి కేసీఆర్​కు ఏనాడూ మనసొప్పలేదు. ఉద్యమకాలంలోనే తెలంగాణకు ప్రజలు పెట్టుకున్న షార్ట్​ ఫామ్​ ‘TG’ ని కూడా అధికారికంగా గుర్తించడానికి ఆయన ఇష్టపడలేదు.

చివరకు తన పార్టీ పేరుకు దగ్గరగా ఉండే  ‘TS’ను అధికారికంగా రాష్ట్రానికి షార్ట్​ఫామ్​గా చేసిపెట్టారు. తన కోసం తప్ప ప్రజల కోసం ఏ సెంటిమెంట్​ను ఆయన ఏనాడూ గౌరవించిన పాపానపోలేదు. కొత్త సీఎం రేవంత్​ రెడ్డి ప్రజల సెంటిమెంట్​ను గుర్తిస్తూ ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా, అలాగే రాష్ట్ర షార్ట్​ఫామ్​గా ఉన్న TS ను తొలగించి ప్రజలు కోరుకున్న ‘TG’ని  తెచ్చారు.​

కేసీఆర్​ కన్నా రేవంత్ రెడ్డికే ప్రజల సెంటిమెంట్ పట్ల​ గౌరవం ఉందనే అభిప్రాయం మాత్రం సర్వత్రా ఏర్పడింది. ఈ మాత్రం ప్రజల సెంటిమెంట్లనే గౌరవించని కేసీఆర్​ పదేండ్లు తెలంగాణను ఏవిధంగా పాలించాడో వేరే చెప్పనక్కర లేదేమో! తెలంగాణను పదేండ్లు తన కోసం కాకుండా, ప్రజల కోసం పాలించినవాడైతే, ప్రజల సెంటిమెంట్లను గౌరవించేవాడే కదా!

శ్వేతపత్రాలు, దర్యాప్తులతో పారదర్శకత

పదేండ్లలో తెలంగాణ ఏమేం నష్టపోయిందో రేవంత్​రెడ్డికి కొంత అవగాహన ఉన్నా.. అధికారం చేపట్టగానే అన్ని ప్రధాన రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజల ముందుంచారు. వాటిలో జరిగిన అక్రమాలపై దర్యాప్తులకు ఆదేశించారు. కేసీఆర్​ పాలనలో జరిగిన అనర్థాలను వెలికితీస్తే కానీ, మోయలేని అప్పులు ఎందుకయ్యాయో తెలిసిరాదు.

జరిగిన అవినీతిని వెలికి తీసి రికవరీ చేయాల్సిన అవసరమూ ఉంది. రేవంత్​రెడ్డి 5 నెలల పాలనలో చాలామేరకు పారదర్శకత చాటుకున్నారు. కేసీఆర్​ ఊడ్చేసి పోయిన ఖజానా వల్ల హామీల అమలులోనే కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు పదేండ్ల కేసీఆర్​ అనర్థ పాలనే కారణమని ప్రజలకు సైతం తెలిసిపోయింది. 

ప్రజలు నమ్మినా.. 

5 నెలల్లోనే అన్నీ చేయలేరని ప్రజలకూ తెలుసు. అయినా, కాంగ్రెస్​ నేతలు అన్నీ అమలు చేశామన్నట్లు ప్రచార సభల్లో చెప్పడమే బాగాలేదు. కేసీఆర్​ ఊడ్చేసిపోయిన ఖజానా ఇచ్చి పోయాడని స్వయాన ప్రజలకే అవగాహన ఉన్నపుడు, ఉన్నది ఉన్నట్టు చెప్పినా ప్రజలు అర్థం చేసుకునేవారే. చాలా మేరకు ఇచ్చిన హామీలను ప్రారంభించిన మాట నిజం.  గ్యాస్​ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ వంటివి అమలులోకి తెచ్చిన వెంటనే లోక్​సభ ఎన్నికలు వచ్చాయి. కోడ్​ అడ్డుపడింది.

ఎన్నికల తర్వాత వాటిని అమలు జరుపుతామని చెపితే ప్రజలు సైతం నమ్మేవాళ్లే. హామీలపై వివరణ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండగా అమలు చేశామని చెప్పాల్సిన అక్కరే లేదు!  రైతు భరోసా బాగానే అమలు చేశారు. రైతు రుణమాఫీ ఆగస్టు 15 వరకు అమలు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీని రైతులు నమ్ముతున్నారు. మొత్తంమీద కాంగ్రెస్​పై కేసీఆర్​ చేసిన దుష్ప్రచారం వర్కవుట్​ కాలేదు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపునకు ప్రస్తుతం పెద్దగా అడ్డంకులేమీ లేవనే చెప్పాలి. 

బీజేపీ ప్లస్​లు, మైనస్​లు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమస్యలను పెద్దగా పట్టించుకున్న దాఖలా మాత్రం లేదు. కేవలం ప్రధాని నరేంద్రమోదీ పేరుతో మాత్రమే అది  గెలుపులను ఆశిస్తున్నది. అయితే స్థానిక నాయకత్వ కొరత ఆ పార్టీకి పెద్ద మైనస్​ పాయింట్​.  బీజేపీ మెరుగైన అభ్యర్థులనే నిలిపింది. అలాగే, అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించింది. అంతవరకు ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలే. స్థానిక ఎజెండా లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్​. ప్రజల్లో  మోదీ పేరు వినబడుతున్న మాట నిజమే. అది ఓట్లు తేవచ్చు తప్ప, ఎన్ని స్థానాల్లో గెలుపులు తేగలదనేదే ప్రశ్న.

కాబట్టి, గెలుపులకు మోదీ పేరు మాత్రమే సరిపోయేది కాదు, స్థానిక సమస్యల ఎజెండా కూడా ఉండి ఉంటే ఆ పార్టీకి మరింత కలిసొచ్చే అవకాశం ఉండేది. అందుకే, కాంగ్రెస్​ కన్నా ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు తక్కువే అని చెప్పాలి.   మొత్తం మీద, కాంగ్రెస్​ కే అత్యధిక స్థానాలు లభించవచ్చని సర్వేలు సైతం చెపుతున్నాయి. బీజేపీ ఎన్ని స్థానాలు గెలవచ్చు అనే కన్నా, కాంగ్రెస్​కు అది గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరొక విధంగా చెప్పాలంటే, బీఆర్​ఎస్​ స్థానాన్ని పరోక్షంగా బీజేపీ ఆక్రమించిందనే చెప్పాలి.

ఈ సారి లోక్​సభ ఎన్నికలతో భవిష్యత్ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్​ఎస్​ ఉనికి సన్నగిల్లి, బీజేపీకి ఒక స్థిరత్వాన్ని తెచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. రెండు జాతీయపార్టీలు రాష్ట్రంలో స్థిరపడే పరిస్థితికి ఈ లోక్​సభ ఎన్నికలు శ్రీకారం చుడుతాయా అనేదే ఆసక్తిగా చూడాల్సిన విషయం. ఫోన్​ట్యాపింగ్​ వ్యవహారం బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన అక్రమాలకు అద్దం పట్టింది.  దేశ భద్రతకు సంబంధించిన సమాచారాలు కూడా..

సాక్ష్యాలను తుడిచేసే పనిలో భాగంగా  ధ్వంసం చేశారని తెలుస్తుంది.  ఇలాంటి అవినీతి, అక్రమాలు క్షమిస్తే పోయేవికావు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నిక్కచ్చిగా దర్యాప్తులు జరిపితే గానీ ఇటు తెలంగాణకైనా, అటు దేశానికైనా మంచిది. ఈ విషయాన్ని తెలంగాణలో లోక్​సభ ఎన్నికల్లో గెలవబోయే ఆ రెండు పార్టీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

రాముడు కావాలె, రాజ్యాంగమూ కావాలె

పదేండ్లు అనేక రకాలుగా నష్టపోయిన తెలంగాణకు రాజకీయాలకతీతంగా అన్ని విధాలా న్యాయం చేయాలని గుర్తిస్తే,  తెలంగాణలో కాంగ్రెస్​, బీజేపీల రేపటి  గెలుపులకు సార్ధకత దక్కుతుంది. తెలంగాణ ప్రజలకు రాముడు కావాలె, రాజ్యాంగమూ కావాలె.. అని అర్థంచేసుకోవాల్సింది ఆ రెండు పార్టీలే!

దర్యాప్తులు అనివార్యం

పదేండ్లు వెనక్కి వెళ్లిన తెలంగాణను వేగంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్​, బీజేపీలపైనే ఉండబోతున్నది. ప్రస్తుత లోక్​సభ ఎన్నికల ఫలితాల తీర్పు కూడా అదే అని ఆ రెండు పార్టీలు గుర్తుంచుకుంటే, తెలంగాణలో వాటి రాజకీయ భవిష్యత్తుకే మంచిది. పదేండ్ల తెలంగాణలో జరిగిన  అవినీతిని వెలికితీయడం అనివార్యం. అది తెలంగాణ రాజకీయాల ప్రక్షాళనకు నాంది కావాలి. అందుకు రేపటి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి.

అదేమీ లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి దర్యాప్తులను రాజకీయ క్రీడగా మార్చితే మాత్రం తెలంగాణ మరింత నష్టపోనుంది. భారీ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి తెలంగాణ అర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేసింది. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే.. అవినీతి చేసిన ఆర్థిక విధ్వంసం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి.

- కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి,
సీనియర్​ జర్నలిస్ట్​