మేడిపల్లిలో లాంగ్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ కార్స్‌‌‌‌ దాష్టీకం

మేడిపల్లిలో  లాంగ్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ కార్స్‌‌‌‌  దాష్టీకం
  •     ఇద్దరు బాలికలు, ఐదుగురు యువకుల కిడ్నాప్‌‌‌‌,  దాడి
  •     మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన 
  •     పోలీసు స్టేషను ముందు గిరిజన సంఘాల ధర్నా 

 మేడిపల్లి, వెలుగు: మేడిపల్లిలోని లాంగ్ డ్రైవ్ కార్స్ యాజమాన్యం తమ సంస్థలో జాబ్‌‌‌‌ మానేసిన గిరిజన అమ్మాయిలు, యువకులను కిడ్నాప్‌‌‌‌ చేసి దాడులకు పాల్పడ్డారని గిరిజన సంఘాలు మేడిపల్లి పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టాయి.  బాధితులు, గిరిజన సంఘాల నాయకులు  తెలిపిన వివరాల ప్రకారం..   మేడిపల్లి పీఎస్ పరిధిలోని లాంగ్ డ్రైవ్ కార్స్ పేరిట కొప్పుల హరిదీప్ రెడ్డి వ్యాపారం నిర్వహిస్తున్నాడు.  

ఇందులో  బిజిలి రిషిత, వెంపాటి మధుమిత, డి. సాయి తరుణ్‌‌‌‌, యోగి, సమీర్‌‌‌‌‌‌‌‌, ఒబేర్  లాంగ్ డ్రైవ్ కార్స్‌‌‌‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.  యాజమాన్యం పనిలో ఇబ్బందులు పెడుతుంటే నచ్చక జాబ్ మానేశారు.  పని మానేసిన వీరు తమ కంపెనీ పక్షాన కాకుండా వేరే వారికి ప్రమోషన్స్ చేస్తున్నారని భావించిన లాంగ్ డ్రైవ్ కార్స్ యాజమాన్యం ఆదివారం మధ్యాహ్నం 3  గంటల సమయంలో వీరిని కిడ్నాప్‌‌‌‌ చేసి బంధించి తమకు చెందిన గోడౌన్ లో ముగ్గురు మహిళలు, ఐదుగురు బౌన్సర్లతో కలిసి విచక్షణ రహితంగా దాడిచేసి గాయపరిచారు.  కులం పేరుతో దూషించారని ఈ విషయం ఎక్కడైనా చెబితే మీపై బ్రోతల్‌‌‌‌, గంజాయి సరఫరా, డ్రగ్స్‌‌‌‌, కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని భయభ్రాంతులకు గురి చేశారు.  

దీంతో చేసేదేమీ లేక బాధితులు తమకు తెలిసిన వారికి విషయం చెప్పి ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని మేడిపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో రంగంలోకి దిగిన గిరిజన సంఘం నాయకులు పోలీస్ స్టేషను ముందు ఆందోళనకు దిగారు.  మేడిపల్లి సీఐ గోవింద్‌‌‌‌ రెడ్డి స్పందిస్తూ దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని మీడియాకు తెలిపారు.