ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్లలో.. లాంగ్ జంప్ డిస్టెన్స్​ తగ్గించాలె : ఆర్ఎస్ ప్రవీణ్

ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్లలో.. లాంగ్ జంప్ డిస్టెన్స్​ తగ్గించాలె : ఆర్ఎస్ ప్రవీణ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఫిజికల్ ఈవెంట్లలో కఠినంగా వ్యవహరిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ఆరోపించారు. తెలంగాణలో లాంగ్ జంప్ 3.8 మీటర్ల నుంచి 4 మీటర్లకు పెంచారని, షాట్ పుట్ 5.6 మీటర్ల నుంచి 6 మీటర్లు పెంచారని మండిపడ్డారు. దీంతో అభ్యర్థులు నష్టపోతున్నారని అన్నారు. సోమవారం బీఎస్పీ స్టేట్ ఆఫీస్​లో ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ఆర్మీలో కూడా లాంగ్ జంప్ 4 మీటర్లు లేదని, ఎక్కువ మంది హాజరు కాకూడదనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఎత్తు కొలిచే సందర్భంలో సాంకేతిక లోపంతో అభ్యర్థులు నష్టపోతున్నారని, మాన్యువల్​గానే హైట్ కొలవాలన్నారు. కమ్యూనికేషన్, ఎక్సైజ్ అభ్యర్థులకు కూడా 3 ఈవెంట్లు తప్పనిసరి చేయడం దారుణమన్నారు. 

ఈ అంశంపై సమస్యలు చెప్పుకోడానికి వెళ్లిన వారిని అరెస్టు చేసుడేందని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం, హోంమంత్రి స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లాంగ్ జంప్ 3.8 మీటర్లు పరిగణలోకి తీసుకోవాలని, షాట్ పుట్ లైన్ మీద పడినా క్వాలిఫై చేయాలని, 3 ఈవెంట్స్ తప్పనిసరిపై పునరాలోచించాలని కోరారు. పాఠాలుగా కృష్ణ స్వామి జీవిత చరిత్ర.. హైదరాబాద్ నగర మొదటి మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం  కృష్ణ స్వామి 55వ వర్ధంతి సందర్భంగా జేబీఎస్  వద్ద ఆయన విగ్రహానికి ప్రవీణ్ కుమార్ నివాళి అర్పించారు.