స్వదేశానికి వెళ్లేందుకు విదేశాల్లోని ఇజ్రాయెల్ పౌరుల ఆరాటం

స్వదేశానికి వెళ్లేందుకు విదేశాల్లోని ఇజ్రాయెల్ పౌరుల ఆరాటం

లాస్ ఏంజిలిస్: హమాస్ మిలిటెంట్ల విధ్వంసం చూసి విదేశాల్లో ఉంటున్న ఇజ్రాయెల్ పౌరులు చలించి పోయారు. యుద్ధ ప్రకటన నేపథ్యంలో మాతృభూమి కోసం పోరాడేందుకు ఆరాట పడుతున్నారు. ఏథెన్స్ మొదలు కొని న్యూయార్క్ దాకా.. వివిధ దేశాల్లో స్థిరపడ్డ, ఉద్యోగం కోసం వచ్చిన ఇజ్రాయెల్​ పౌరులు విమానాశ్రయాలకు పోటెత్తుతున్నారు. అయితే, యుద్ధం కారణంగా టెల్​ అవీవ్​ కు విమానాలు నడవడం లేదు. 

దీంతో ప్రత్యేకంగా విమానాలను బుక్ చేసుకుని వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆన్ లైన్ చాట్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మాతృభూమికి ఎలా సేవ చేయాలనే విషయంపై నిరంతరం చర్చలు జరుపుతున్నారు. కొందరేమో సైన్యంలో చేరి ఇజ్రాయెల్ తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు స్వదేశానికి వెళుతుండగా.. మరికొందరు ఏదో ఒక రకంగా జన్మభూమి రుణం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 

హమాస్ పై యుద్ధం ప్రకటించిన ప్రధాని నెతన్యాహు.. సుమారు 3 లక్షల మంది రిజర్విస్టులను సైన్యంలో సేవలందించేందుకు పిలిచారు. దీంతో వివిధ వృత్తులలో స్థిరపడిన వారంతా యుద్ధ రంగంలోకి అడుగుపెడుతున్నారు.