హైవేపై కత్తులతో దోపిడీ దొంగల బీభత్సం

హైవేపై కత్తులతో దోపిడీ దొంగల బీభత్సం

మెదక్ జిల్లా తూప్రాన్ జాతీయ రహదారిపై దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ముగ్గురు డ్రైవర్లపై కత్తులతో దాడి చేశారు. పోలీసుల రాకను గమనించి దొంగలు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూప్రాన్ లో రెండు బైకులు చోరీ చేసిన దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. తూప్రాన్ శివారులో ఓ దాబా దగ్గర నిజామాబాద్ కు చెందిన డ్రైవర్ల సెల్ ఫోన్ల చోరీకి యత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన డ్రైవర్లు అజారుద్దీన్, హైమద్ ఖాన్, నోమాల్ ఖాన్ పై కత్తులతో దాడి చేశారు.

దొంగల బీభత్సం.. బాధితుల అరుపుల కేకలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. తూప్రాన్ పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే రావడంతో దుండగులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వెంబడించడంతో టోల్ ప్లాజా సమీపంలో పోలీసులపై రాళ్లు రువ్వి ముందుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
దొంగల కోసం పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎట్టకేలకు దొరికిపోయారు. ముగ్గురు దొంగల్లో అర్జున్ రెడ్డి, శ్రీహరి అనే ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు గత కొన్ని రోజులుగా తూప్రాన్ అభ్యాస స్కూల్ దగ్గర డేరాలు వేసుకొని నివాసం ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.