హిందుత్వం, రాముడు ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు

హిందుత్వం, రాముడు ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు

అయోధ్య రామ మందిర నిర్మాణానికి తన ట్రస్టు తరఫున రూ. కోటి విరాళంగా ప్రకటించారు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం అయోధ్య రామ మందిర నిర్మాణ స్థలాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఆయన వెంట కుమారుడు, టూరిజం మంత్రి ఆదిత్య ఠాక్రే సహా శివసేన ఎంపీ సంజయ్ రౌత్, పలువురు నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు చేశారు. తాను బీజేపీ నుంచి దూరంగా జరిగానే కానీ, హిందుత్వం నుంచి కాదని చెప్పారు ఉద్ధవ్. తన ఐడియాలజీలోఎటువంటి మార్పు రాలేదన్నారు. బీజేపీ అంటే హిందుత్వ అని కాదని, హిందుత్వ వేరు, బీజేపీ వేరని అన్నారాయన. రాముడు, హిందుత్వం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదంటూ బీజేపీని పరోక్షంగా విమర్శించారు.

రాముడి ఆశీస్సుల కోసం వచ్చా

తాను రాముడి ఆశీస్సుల కోసం అయోధ్య వచ్చానని చెప్పారు ఉద్ధవ్ ఠాక్రే. ఏడాదిన్నరలో తాను ఇక్కడికి రావడం మూడోసారన్నారు. పాలన మంచిగా సాగాలని భగవంతుడిని పూజిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన ఆయన, ఆ మొత్తాన్ని ప్రభుత్వం తరఫున కాకుండా తన సొంత ట్రస్టు నుంచి ఇస్తానని చెప్పారు. కాగా, అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్టు తొలి సమావేశంలోనే ప్రభుత్వాల నుంచి విరాళాలు స్వీకరించబోమని ప్రకటించింది.

ట్రస్టులో శివసైనికుడిని నియమించాలి

అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి కేంద్రం నియమించిన ట్రస్టులో శివసేన నుంచి ఒకరిని నియమించాలని కోరారు ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సారనాయక్. అక్కడ ఆలయ నిర్మాణం కోసం శివసన, ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేసిన పోరాటం, కృషిని మర్చిపోకూడదని కోరుతూ ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. రామ భక్తుడిగా ఒక శివసైనికుడికి ఆ ట్రస్టులో అవకాశం కల్పించాలని అందులో విజ్ఙప్తి చేశారు.