ప్రపంచమంతా రామనామం వినిపిస్తోంది: మోడీ

ప్రపంచమంతా రామనామం వినిపిస్తోంది: మోడీ
  • ఏండ్లుగా టెంట్‌లో ఉన్న రాముడు..
  • ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాడన్న మోడీ

అయోధ్య: ఉత్తర్‌‌ప్రదేశ్‌ అయోధ్యలోని రామజన్మభూమిలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమి పూజ చేశారు. ఏళ్లుగా మిగిలిపోయిన హిందువుల కోరికను నెరవేర్చారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జై శ్రీరామ్‌ నినాదాలతో మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. దీంతో కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నామం కేవలం అయోధ్య వరకు మాత్రమే కాదని, ప్రపంచం మొత్తం వినిపిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. కొన్ని ఏండ్లుగా టెంట్‌లోనే ఉంటున్న రామ్‌లల్లాకి ఇప్పుడు సొంత గుడి ఏర్పాటు కానుందని మోడీ అభిప్రాయపడ్డారు. “ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసే మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు నాకు కల్పించింది. దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయింది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడికి భవ్య మందిర నిర్మాణం ప్రారంభమైంది. రాముడి ఆదర్శాలు కలియుగంలో పాటించేందుకు మార్గం ఇది. కోట్లామంది మనో సంకల్పం ఈ మందిరం. కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్‌లో రామాయణ గాథలు ప్రసిద్ధి. రామ మందిర నిర్మాణం కోసం ఆత్మ త్యాగం చేసిన వారికి 135 కోట్ల మంది తరఫున ధన్యవాదాలు. రాముడి ప్రేరణతో భారత్‌ ముందుకెళ్తోంది” అని మోడీ చెప్పారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ శిలాఫలకాన్ని మోడీ ఆవిష్కరించారు. పోస్టల్‌ స్టాంప్‌ను కూడా రిలీజ్‌ చేశారు. కార్యక్రమంలో ఉత్తర్‌‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా.. అయోధ్యను దర్శించిన మొదటి ప్రధాని నరేంద్ర మోడీనే. 29 ఏండ్ల తర్వాత మోడీ అయోధ్యకు వచ్చారు.