దేశంలో రామ రాజ్యం.. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం

దేశంలో రామ రాజ్యం.. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం

దుబ్బాక: దేశమంతా రామరాజ్యం నడుస్తుంటే ఒక్క మన రాష్ట్రంలోనే రజాకార్ల రాజ్యం నడుస్తోందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన మోతె గ్రామం లో పర్యటించారు. ఈ సందర్భంగా  రఘునందన్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు..  ఆయనను ఆయనే షూట్ చేసుకొనే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. దుబ్బాక ఎన్నికలు దేవుడు తెచ్చినవని ఆయన పేర్కొన్నారు. రామలింగారెడ్డి కి అలా అవుతుందని ఎవరైనా అనుకున్నారా..?  సిద్దిపేట నియోజకవర్గంలోని తోర్నల్, ఇర్కోడ్ ఎంత బాగా అభివృద్ధి చెందాయి… తెలంగాణ లో ఎక్కడ లేని విధంగా మిరుదొడ్డి లో … డాంబర్ రోడ్ పై మట్టి పోయడం విడ్డూరంగా ఉంది.. బీజేపీ వస్తే ఫించన్లు ఆగిపోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు…  ఎలా ఫించన్లు ఆగిపోతాయో చెప్పాలని రఘునందన్ రావు ప్రశ్నించారు. రైతు బంధు పైసలు రఘునందన్ కొట్లాడుతనే దుబ్బాక కు వస్తున్నాయని చెప్పారు. .

కేసీఆర్, హరీష్ భయపడుతున్నారు -బొడిగే శోభ కామెంట్స్

దుబ్బాక ఉప ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును చూసి సీఎం కేసీఆర్, హరీష్ రావులు  భయపడుతున్నారని బీజేపీ మహిళా విభాగం నాయకురాలు బొడిగె శోభ పేర్కొన్నారు. మా నాయకుడు బండి సంజయ్ ను అరే బిడ్డా అంటావా..?  కరీంనగర్ రా చూసుకుందాం… నువ్వు నీ మామ ను తీసుకొని ఓయూ గడ్డ మీదకు రా…  తెలంగాణ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పు అని నిలదీశారు. తెలంగాణ వచ్చాక ఒక్క కేసీఆర్ కుటుంబానికే అన్ని ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. సిద్దిపేట ను అభివృద్ధి చేసినట్లు దుబ్బాక ను ఎందుకు అభివృద్ది చేయలేదు..?  రామ లింగారెడ్డే ఏంచేయలేదు.. ఇక ఆయన భార్య ఏం చేస్తుంది.? అని ప్రశ్నించారు. బాంచెన్ అనే వారినే కేసీఆర్ దగ్గర పెట్టుకుంటాడు… మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. గ్రామ పంచాయితీ నిధులు కేంద్రానివేనని ఆమె పేర్కొన్నారు. రఘునందన్ గెలిపిస్తే నిత్యం ప్రజల్లోనే ఉంటాడని బొడిగె శోభ హామీ ఇచ్చారు.