ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

ఎల్లుండి నుంచి లారీలు బంద్‌‌!

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాలు, ధాన్యం, ఇతర సరుకులు రవాణా చేస్తున్న లారీలు, డీసీఎంలను బంద్​ చేయాలని వాటి ఓనర్లు యోచిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా బండ్లు రోడ్డెక్కడమే లేదని, అందువల్ల క్వార్టర్లీ ట్యాక్స్​ ఎట్లా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి క్వార్టర్లీ ట్యాక్స్​ను మాఫీ చేయాలని, లేకుంటే ఈ నెల 30 నుంచి వెహికల్స్​ ను నిలిపివేస్తామని అంటున్నారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో ట్యాక్స్‌‌ మాఫీకి సర్కారు సుముఖంగా లేదని అధికారులు చెప్తున్నారు.

20శాతమే నడుస్తున్నయ్‌‌..

లాక్​డౌన్​ మొదలైన మార్చి 23న లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తర్వాత లాక్‌‌ డౌన్‌‌ పొడిగించడంతో డ్రైవర్లు బండ్లను వదిలేసి ఇండ్లకు వెళ్లిపోయారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సరుకుల రవాణాకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తంగా లక్షా 70 వేల లారీలు, డీసీఎంలు ఉండగా.. ప్రస్తుతం అందులో 20 శాతమే నడుస్తున్నాయి. దాదాపు అన్ని రకాల గూడ్స్‌‌ వాహనాలను నడుపుకోవడానికి కేంద్రం అనుమతిచ్చినా రాష్ట్రం మాత్రం సడలించలేదు. అత్యవసర సరుకులు మాత్రమే రవాణా అవుతున్నాయి.

క్వార్టర్లీ ట్యాక్స్‌‌ మాఫీ చేయాల్సిందే..

వాణిజ్యపరంగా వినియోగించే వెహికల్స్​ఓనర్లు ప్రతి మూడు నెలలకోసారి రవాణా శాఖకు క్వార్టర్లీ ట్యాక్స్‌‌ చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే వెహికల్​ తిరిగేందుకు అనుమతి ఉండదు, తిరిగితే సీజ్‌‌ చేస్తారు. ప్రస్తుతం లాక్​డౌన్​ ఉండటంతో నెల రోజులకుపైగా చాలా వరకు లారీలు, డీసీఎంలు నడవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ట్యాక్స్‌‌ ఎలా కట్టాలని ఓనర్లు అంటున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఆర్టీఏ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అధికారులు ఆర్థిక శాఖకు రిపోర్ట్​ పంపినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే సర్కారు డబ్బుల్లేక ఇబ్బందుల్లో ఉందని, మాఫీ చాన్స్​ ఉండదని ఓ అధికారి చెప్పారు. లారీలకు మాఫీ చేస్తే, ఇతర ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వెహికల్స్​ వాళ్లూ డిమాండ్‌‌ చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం ఆరు లక్షల వరకు ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వాహనాలు ఉన్నాయి.

మరింత తిప్పలే..

లాక్‌‌డౌన్‌‌ తో రాష్ట్రంలో ఇప్పటికే పలు సరుకులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. ప్రస్తుతం లారీలు, డీసీఎంల ద్వారా పండ్లు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు, బియ్యం ఇతర నిత్యావసరాలు, మెడికల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌, ఐకేపీ ధాన్యం వంటివి రవాణా అవుతున్నాయి. ఒకవేళ లారీలు, డీసీఎంలు బంద్‌‌ అయితే రవాణా ఆగిపోయి.. మరిన్ని తిప్పలు తప్పని పరిస్థితి నెలకొంటుంది.