
హైదరాబాద్ సిటీలో లారీ ప్రమాదాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. వారం రోజుల్లోనే రెండు లారీలు.. మెట్రో రైలు పిల్లర్లను ఢీకొనటం విశేషం. మొన్నటికి మొన్న పంజాగుట్టలో ఓ సిమెంట్ లారీ మెట్రో పిల్లర్ ను ఢీకొంది.. నాలుగు రోజుల తర్వాత.. 2024, ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున హైదర్ నగర్ లో మరో లారీ మెట్రో రైలు పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాల్లోనూ పిల్లర్ కు ఏమీ కాకపోయినా.. రెండు లారీల ముందు భాగాలు బాగా దెబ్బతిన్నాయి.
ఈరోజు హైదర్ నగర్ లో మైసమ్మ గుడి దగ్గర మెట్రో పిల్లర్ 657ను వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి డీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మెట్రో పిల్లర్ ను బలంగా ఢీకోట్టడంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయిది. రోడ్ కు అడ్డంగా లారీ ఉండడంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన లారీ డ్రైవర్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం లారీని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. గాయపడిని లారీ డ్రైవర్ ను పంజాబ్ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.