లారీ టైర్ బ్లాస్ట్..ఒకదానికొకటి ఏడు కార్లు ఢీ..నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లిలో NH 44పై ఘటన

లారీ టైర్ బ్లాస్ట్..ఒకదానికొకటి ఏడు కార్లు ఢీ..నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లిలో NH 44పై ఘటన

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్‌‌‌‌పల్లి సమీపంలోని 44 నేషనల్ హైవేపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. లారీ టైర్ పేలి డివైడర్‌‌‌‌ను ఢీకొనడంతో వెనుక వస్తున్న ఏడు కార్లు, ఓ ఎరువుల లారీ ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు స్వల్ప గాయాలతో బయటపడగా వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. 

ప్రత్యక్ష సాక్షులు, ఇందల్వాయి ఎస్‌‌‌‌ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ టైర్ చంద్రాయన్‌‌‌‌పల్లి వద్ద ఒక్కసారిగా పేలి డివైడర్‌‌‌‌ను ఢీకొట్టింది. దాని వెనుక వస్తున్న కార్ల డ్రైవర్లు ప్రమాదాన్ని గుర్తించి వేగం తగ్గించారు. 

అయితే కార్ల వెనుక యూరియా సంచులతో వస్తున్న లారీ అదుపుతప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో మొత్తం ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొని తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏడుగురు గాయపడగా 108 అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌‌‌‌ఐ సందీప్ తెలిపారు.