
న్యూఢిల్లీ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బున్న వాళ్లకు కాకుండా.. దమ్మున్న వాళ్లకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. పిల్లికి భిక్షం పెట్టినట్లు.. ఓడిపోయే టికెట్లు కమ్మ వర్గానికి ఇస్తామంటే కుదరదన్నారు. గ్రామాల్లో పట్టున్న లీడర్లను కట్ చేసి, ఎవరో కోన్ కిస్కా గాళ్లకు సీట్లు ఇచ్చుకుంటే చేతులు కాలుతాయని.. ఆ తర్వాత ఆకులు పట్టుకున్నా లాభం ఉండదని సెటైర్లు వేశారు.
కామన్ సెన్స్‌తో హైకమాండ్ బ్యాలెన్స్ చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తాము అడుగుతున్నది సామాజిక న్యాయమని హైకమాండ్‌కు కౌంటర్ ఇచ్చారు. గతంలో ఒక సామాజిక వర్గానికి 38 సీట్లు ఇస్తే.. అందులో 8 మందే గెలిచారని, ఇప్పుడు ఇద్దరే మిగిలారని ఎద్దేవా చేశారు. కానీ, కమ్మ వర్గానికి ఒక్క టికెట్ ఇవ్వలేదని గుర్తుచేశారు.