మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ భారతి హోళికేరి అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలపైనే ఎక్కువ పిటిషన్లు వచ్చాయి. జన్నారం మండలం కిష్టాపూర్‌కు చెందిన నోముల రాజేందర్ తనకు పొనకల్ శివారులో 16 ఎకరాలు 6 గుంటల భూమి ఉండగా, 13 ఎకరాల 36 గుంటలు విక్రయించామని, మిగతా భూమిని కొందరు కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. జైపూర్ మండలం నర్వకు చెందిన గోదరి లింగయ్య గ్రామ శివారులోని తన భూమిని మరొకరు తప్పుడు పత్రాలతో వారి పేరిట మార్చుకొని విక్రయించాడని, విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించాడు. దండెపల్లికి చెందిన ఇమ్మిడిశెట్టి శంకరయ్య గ్రామ శివారులోని తన భూమిని ఇతరులు కబ్జా చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. పింఛన్లు, హౌస్ పర్మిషన్లు, ఇతర సమస్యలపై పలువురు పిటిషన్లు అందజేశారు. ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవాలి... తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నామని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. ఇందుకోసం ఓటర్లు ముందుకు రావాలని కోరారు.
అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి...
ఆసిఫాబాద్,వెలుగు: వివిధ సమస్యలపై బాధితులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆఫీసర్లు దృష్టిసారించాలని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలు స్వీకరించారు. రెబ్బెన మండలం నవేగాం గ్రామానికి చెందిన గౌరయ్య పెన్షన్ ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. కాగజ్ నగర్ పోచమ్మ బస్తీకి చెందిన మహమ్మద్ అబురార్ డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అర్జీ ఇచ్చాడు. వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన గోమాసే రాజేశ్వరి తన కుమార్తె గత నెల28న జ్వరంతో చనిపోయిందని.. న్యాయం చేయాలని వేడుకుంది. ఆసిఫాబాద్ పోచమ్మ వాడకు చెందిన గంధ పరమేశ్వరి ఆసరా పెన్షన్ మంజూరుచేయాలని కోరింది. అకారణంగా విధుల నుంచి తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాగజ్నగర్కేజీబీవీ పీఈటీ పార్వతి వినతిపత్రం అందజేశారు. కోవిడ్‌తో భర్త చనిపోయాడని, కుటుంబ పెద్ద లేకపోవడంతో బతకడం కష్టంగా మారిందని కాగజ్ నగర్ మండలం ఈస్గాంగ్రామానికి చెందిన మేడి రజిత వేడుకున్నారు. పిడుగుపాటుతో తిర్యాణి మండలం గంభీరావుపేటలో 152 గొర్రెలు మృతిచెందాయని, బాధితులను ఆదుకోవాలని ఆసిఫాబాద్జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు డీఆర్వో సురేశ్వినతిపత్రం అందజేశారు.
ప్రజావాణి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
ఇచ్చోడ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో విధులు నిర్వహించాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు ఆయన హాజరై అర్జీలు తీసుకున్నారు. బజార్హత్నూర్ మండలం లక్ష్మణ్ నాయక్ తండాకు రోడ్డు వేయాలని శ్రీరామ్ కోరారు. అర్జీలను పరిశీలించిన పీవో శాఖల వారీగా బదలాయించారు. కార్యక్రమంలో ఏపీవో కనక భీంరావు, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్, ఏఎస్డీ కృష్ణయ్య, పీవీటీజీ ఆత్రం భాస్కర్, జేడీఎం నాగభూషణ్, బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, ఏవో రాంబాబు, డీపీవో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
