నయీం గ్యాంగ్​ కథ అంతేనా..

నయీం గ్యాంగ్​ కథ అంతేనా..
  • వరంగల్ కేంద్రంగా వెలుగుచూసిన భారీ మోసాలు, అక్రమాలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ పోలీస్​కమిషనరేట్ పరిధిలో కేసులన్నీ పెండింగ్​పడుతున్నాయి. భారీ మోసాలు, అక్రమాల కేసులు నమోదు చేస్తున్న పోలీస్​ఆఫీసర్లు.. దోషులను పట్టుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. చాలా కేసుల్లో  లీడర్ల ప్రెజర్​కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన  ఎన్నో కేసులు ఇప్పటికీ పురోగతి లేకుండా పోయాయి. కొన్ని కేసుల్లో బాధితులు న్యాయం కోసం స్టేషన్ల చుట్టూ తిరుగుతుండగా.. అక్రమాలకు పాల్పడిన నిందితులు హాయిగా వారి పని వారు చేసుకుపోతున్నారు.

ఫేక్​ సర్టిఫికెట్ల కేసు అక్కడే ఆగింది

వరంగల్ కేంద్రంగా కొన్ని కన్సల్టెన్సీలు, ముఠాలు ఫేక్​సర్టిఫికెట్ల దందాకు తెరలేపాయి. రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్,​ డాక్టర్​తదితర నకిలీ సర్టిఫికెట్​ఇచ్చే బిజినెస్ స్టార్ట్ చేశాయి. ఈ ముఠాను 2021 డిసెంబర్, జనవరి నెలల్లో వరంగల్ టాస్క్​ఫోర్స్​పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 15 మందిని అరెస్ట్​ చేసి, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 11 యూనివర్సిటీలకు సంబంధించిన దాదాపు 300 ఫేక్​సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి సర్టిఫికెట్లు పొందిన ఎంతోమంది విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లగా.. కొంతమంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో జాబ్స్​చేస్తున్నారు. ఇంకొంతమంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు.

వెనక్కి రప్పించి కేసులు పెడతామని..

కాగా నిందితుల వద్ద లభించిన వివరాల ఆధారంగా విదేశాలకు వెళ్లినవారిని వెనక్కి రప్పించి కేసులు పెడతామని సీపీ డా. తరుణ్​జోషి చెప్పారు. నిందితులను విచారించి అక్రమంగా పట్టాలకు సహకరించినవారితోపాటు పొందినవారినీ అరెస్ట్​ చేయాల్సి ఉంది. కానీ గుట్టు బయటపడి నెలలు గడుస్తున్నా ఈ కేసు విషయం ముందుకు కదలకపోవడం వివిధ అనుమానాలకు తావిస్తోంది.  కొంతమంది ఆఫీసర్లు ఫీల్డ్​ఎంక్వైరీ పేరున జేబులు నింపుకొన్నారనే ఆరోపణలుఉన్నాయి. అంతేగాకుండా ఓ ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, ఓ ఆఫీసర్​కొడుకు సహా మంత్రి దగ్గరి బంధువులు కూడా ఫేక్​సర్టిఫికెట్లు పొందినట్లు తెలిసింది. దీంతోనే ఉద్దేశపూర్వకంగానే ఈ కేసును హోల్డ్​ లో పెట్టినట్లు తెలుస్తోంది. 

వారంలో పట్టుకుంటమన్నరు

గతేడాది సెప్టెంబర్​15న నక్కలగుట్ట హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వద్ద పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. హనుమకొండకు చెందిన తిరుపతి, ఆయన కొడుకు సాయిగణేశ్​ ఇద్దరూ కలిసి బ్యాంకులో రూ.25 లక్షలు డ్రా చేశారు. డబ్బును కారులో పెట్టి సంతకం పెట్టడానికి మళ్లీ బ్యాంకు లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి కారు అద్దాలు పగులగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న డబ్బు కనిపించలేదు. బాధితులు అప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక డీసీపీ, ఏసీపీ, సీఐ సహా ఆఫీసర్లంతా వచ్చి పక్కనున్న సీసీ టీవీ రికార్డులు పరిశీలించి ప్రాథమికంగా కొన్ని వివరాలు సేకరించారు. అది ఏపీకి చెందిన వ్యక్తుల పని అని ఆఫీసర్లు అప్పట్లో చెప్పారు. సాధ్యమైనంత తొందర్లో దొంగలను పట్టుకుంటామన్నారు. ఇంతవరకు ఈ కేసు విషయం అడుగు ముందుకు పడలేదు. దీంతో బాధితులు ఇప్పటికీ స్టేషన్​ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

నయీం గ్యాంగ్​ కథ అంతేనా..

వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల రేట్లు బాగా పెరిగిపోవడంతో ములుగు జిల్లాలో పని చేసే ఓ పోలీస్​రిజర్వ్ ఇన్​ స్పెక్టర్, నయీం గ్యాంగ్​లో పని చేసిన ఆయన బంధువు వేణుగోపాల్​తో కలిసి భూ దందాలకు తెరలేపాడు. మొత్తం 10 మంది ముఠాగా ఏర్పడి దందాలు చేశారు. అమాయకులను బెదిరించడం, వివాదాస్పద భూముల్లో ఎంటరై సెటిల్​మెంట్​ చేయడం స్టార్ట్ చేశారు. ఈ గ్యాంగ్​కు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో బాగా దగ్గరి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట ఈ ముఠా బాధితుడు ఒకరు హనుమకొండ, కేయూ, హసన్​పర్తి పీఎస్​లలో కేసు పెట్టారు. కేయూ పోలీసులు ఆరుగురు నిందితులను పట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా జులై 30 అర్ధరాత్రి రిమాండ్​కు తరలించారు. ఇందులో ప్రధాన నిందితులైన ముద్దసాని వేణుగోపాల్, ఆర్ఐ సంపత్ కుమార్, ఇంకో ఇద్దరినీ ఇంతవరకు పట్టుకోలేకపోయారు. నయీం గ్యాంగ్​తో ఇక్కడి లీడర్లకు పరిచయాలు ఉండటం, ఆర్ఐ సంపత్​ కుమార్​కూడా పెద్దాఫీసర్లకు దగ్గరగా ఉంటాడని తెలిసింది.  అయితే ఈ గ్యాంగ్​ను పట్టుకుని 10 రోజులు దాటినా ప్రధాన నిందితుల ఆచూకీ మాత్రం దొరక్కపోవడం గమనార్హం. 

రూ.7 కోట్ల ల్యాండ్​ కథేంటి?

హనుమకొండ బాలసముద్రంలో దాదాపు రూ.7 కోట్ల విలువైన జీడబ్ల్యూఎంసీకి చెందిన స్థలాన్ని కొన్నేండ్ల కింద  ఓ వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేసుకున్నాడు. వాస్తవానికి ఇది ప్రభుత్వ స్థలమే అయినా ఇప్పటికీ ఇద్దరు, ముగ్గురు చేతులు మారింది. దీనిపై నిరుడు గ్రేటర్​టౌన్​ప్లానింగ్ డిపార్ట్​మెంట్​నుంచి భిక్షపతి అనే ఆఫీసర్​సుబేదారి పోలీసులకు కంప్లైంట్​ చేశారు. ఈ ల్యాండ్​ విషయంలో ఇద్దరు పొలిటికల్​ లీడర్లు ఉండటం, పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడంతో పోలీసులు కూడా ఈ కేసును పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. 

పెద్ద కేసులన్నీ ఇంతేనా!

వరంగల్ కమిషనరేట్​లో వెలుగులోకి వచ్చిన భారీ అక్రమాలు, దోపిడీలు, ఇతర ముఖ్యమైన కేసుల ఎంక్వైరీని పోలీసులు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఓ వైపు లీడర్ల నుంచి ప్రెజర్, మరోవైపు క్షేత్రస్థాయిలో కొంతమంది ఆఫీసర్లు అక్రమార్కులకు సహకరించడం వల్లే ఆయా కేసుల్లో పురోగతి ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా రివ్యూలు నిర్వహించే ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై  విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా వరంగల్ పోలీసులు ప్రధాన కేసుల్లో విచారణ త్వరతగతిన పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

లిక్కర్​ డాన్ కథ కంచికేనా..

గ్రేటర్​వరంగల్ లోని కార్పొరేటర్​ భర్త ఓ యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమె నుంచి రూ.90 లక్షల వరకు వసూలు చేశాడు. దీంతో నిందితుడిపై గత ఏడాది సెప్టెంబర్​లో మిల్స్​ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి తండ్రి లిక్కర్​డాన్​కాగా.. పోలీస్​ డిపార్ట్​మెంట్​లో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. నిందితులను అదుపులోకి తీసుకోగా.. చాలా రహస్యాలు బయటపడ్డాయి. లిక్కర్​డాన్​కొడుకు కొంతమంది పోలీస్​ ఆఫీసర్లతో దోస్తానా చేశాడని, ఆఫీసర్లకు భారీ ఆఫర్లు ఇచ్చి దందాలు చేసేవాడని తేలింది. లిక్కర్​డాన్, అతని కొడుకు లీలల వెనుక కొంతమంది పోలీస్​ ఆఫీసర్ల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసు ఫైల్​అయ్యి ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.