మూడు నెలలుగా వేలాడుతున్న శవాలు

మూడు నెలలుగా వేలాడుతున్న శవాలు
  • విషాదాంతమైన ప్రేమికుల అదృశ్యం
  • మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం

మహబూబ్‍నగర్‍ టౌన్‍, వెలుగు: మూడు నెలలుగా చెట్టుకు వేలాడుతున్న శవాలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం వెలుగు చూశాయి. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఇండ్లలోంచి పారిపోయిన జంట జీవితం ఇలా విషాదాంతమైంది. తమ పిల్లలు పెళ్లి చేసుకొని ఎక్కడో సంతోషంగా జీవిస్తున్నారని ఇన్నాళ్లు భావించిన కుటుంబసభ్యులు వాస్తవం తెలిసి కంటికి మంటికి ధారలా ఏడ్చారు. కోయిల్‌కొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రవి(19), రాధిక(20)  కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వారిది ఒకే కులం అయినప్పటికీ కుటుంబ పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో మార్చి 23న ఇంట్లోంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు.

కోయిల్‍కొండ సమీపంలోని రాంకొండ గుట్టల్లో మేకల కాపరులు ఉరి వేసుకొని కుళ్లిపోయి చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను శనివారం సాయంత్రం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసుల విచారణలో మృతులు రాంపూర్‍కు చెందిన రవి, రాధికగా గుర్తించారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయశారు. అక్కడికి చేరుకున్న వారు పిల్లల శవాల్ని చూసి బోరున విలపించారు. ఇద్దరు ఎక్కడో సంతోషంగా జీవిస్తున్నారని అనుకున్న వారు శవాలై కనిపిస్తారని అనుకోలేదని ఏడ్వడం అక్కడున్న వారిని కలిచి వేసింది.