పురుగుల మందు తాగి  .. ప్రేమజంట ఆత్మహత్య

పురుగుల మందు తాగి  .. ప్రేమజంట ఆత్మహత్య

మంగపేట, వెలుగు :  ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల క్షేత్రం సమీపంలో పురుగుల మందు తాగి ఓ ప్రేమ జంట ఆత్మహత్య  చేసుకుంది. మృతుల బంధువులు , పోలీసుల కథనం ప్రకారం.. మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన శిరీష (20), ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన రాజేశ్​ (23)  కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెండ్లికి పెద్దలు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

రాజేశ్​ మంగళవారం పురుగుల మందు కొన్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి మల్లూరు గ్రామ శివారులోని హేమాచల క్షేత్ర సమీపంలోకి వెళ్లి తాగారు. తర్వాత శిరీష తన తండ్రి దుర్గాప్రసాద్ కు ఫోన్ చేసి పురుగుల మందు తాగామని చెప్పి లొకేషన్ షేర్  చేసింది. దీంతో దుర్గాప్రసాద్,  కొందరు గ్రామస్తుల సహకారంతో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉన్న శిరీష, రాజేశ్​లను ఏటూరునాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్  ఎంజీఎంకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శిరీష, రాజేశ్​ కన్నుమూశారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.