
Indian Middle Class: భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు మధ్యతరగతికి చెందినవారే. ఆర్థికంగా కొంత వెనకబడినప్పటికీ.. జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలనే కోరికలు, ఆశలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి వీరిలో. కానీ ఈ కేటగిరీలోని వేతనజీవుల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయనే అంశం ప్రస్తుతం వాస్తవ దృక్కోణంలో అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. లక్కీ భాస్కర్ సినిమాలో చెప్పినట్లు ఆల్మోస్ట్ దరిద్రానికి బోర్డర్ లైన్ లో జీవించటం అనే డైలాగ్ మధ్యతరగతి పరిస్థితి చూస్తే అర్థం అవుతోంది.
బెంగళూరు కేంద్రం పనిచేస్తున్న ఫిన్ టెక్ సంస్థ సీఈవో ఆషిష్ సింఘాల్ మధ్యతరగతి ప్రజల కష్టాలపై చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వాస్తవానికి రూ.5 లక్షల నుంచి రూ.కోటి లోపు వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులు మధ్యతరగతి కేటగిరీ కిందికి వస్తారు. వీరి వేతనాలు కేవలం 0.4 శాతం పెరగగా ద్రవ్యోల్బణం మాత్రం 80 శాతం పెరిగి కనీసం బతకటం కూడా కష్టంగా మారిందని సింఘాల్ అన్నారు. ఇక పెరిగిన ఖర్చులతో వీరి కొనుగోలు శక్తి తగ్గిపోవటంతో పాటు డబ్బు దాచుకోలేక ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఆదాయం పెరగనప్పటికీ ఖర్చులను మధ్యతరగతి ప్రజలు అలాగే కొనసాగిస్తున్నారని వెల్లడైంది. ఈ క్రమంలో వారు చేసే జొమాటో ఆర్డర్లు, పిల్లల స్కూల్ ఫీజులు, ఏడాదికి ఒకసారి వెకేషన్స్, కొత్త ఫోన్లు, చెల్లించాల్సిన ఈఎంఐలు వంంటివి అలాగే కొనసాగుతున్నాయని సింఘాల్ అన్నారు. అయితే ఈ ఖర్చుల కోసం వారు అప్పులపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. కొంత మంది ఏకంగా ఆరోగ్యానికి ఖర్చు చేయలేక డాక్టర్ విజిట్స్ కూడా వాయిదాలు వేసుకుంటున్నారని ఫిన్ టెక్ సీఈవో పేర్కొన్నారు.
ఒకపక్క ఏఐ విస్తరణతో వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడటం, దారిద్యంలో ఉన్న వారికి ప్రభుత్వాలు పథకాలతో ఆర్థిక సహాయం, పెరుగుతున్న సంపన్నుల సంఖ్య మధ్య మధ్యతరగతి ప్రజలు మాత్రం నలిగిపోతున్నారు. పెరుగుతున్న భారాలు ఈ కేటగిరీవారినే ప్రభావితం చేస్తున్నాయి. పేదలకు ప్రభుత్వాల అండ సంపన్నులకు పెరిగిన ఆదాయాలు ఉంటే మధ్యతరగతివాడికి మాత్రం అప్పులే మిగులుతున్నాయి. ఈ క్రమంలో పెరిగిపోతున్న ఒత్తిడి తట్టుకోలేక మధ్యతరగతి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసులు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి.
వాస్తవానికి భారతీయ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగటానికి ఎక్కువగా దోహదపడుతున్న వారు మధ్యతరగతే. కానీ వీరే ఎక్కువ ఒత్తిడి, భారంతో నలిగిపోతున్నారని సింఘాల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ కేటగిరీపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో మధ్యతరగతి కింద ఉన్న వ్యక్తుల సంఖ్య 30 శాతానికి పైన ఉండగా 2047 నాటికి అది 60 శాతానికి చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయాలు కూడా పెరగాలని అప్పుడే భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారటానికి మధ్యతరగతి కూడా దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు.