రాష్ట్రంపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం

రాష్ట్రంపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం
  • హైదరాబాద్కు ఎల్లో అలర్ట్.. 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • హైదరాబాద్తో పాటు జిల్లాల్లో విస్తారంగా వానలు
  • వర్షాల ప్రభావంతో 3 జిల్లాల్లో ఆరుగురు మృతి

హైదరాబాద్: రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారుల అంచనా. ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 8మంది చనిపోయారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కారణంగా అనేక కాలనీలు జలమయం అయ్యాయి.  డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట జలాశయానికి భారీగా వరద రావడంతో.. 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  కరీంనగర్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్ల ముందు వరద నిలవడంతో.. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గన్నేరువరం, పారువెల్ల చెరువు  పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

వాగులో కొట్టుకుపోయిన కారు

రాజన్నసిరిసిల్ల  జిల్లాలో భారీ వర్షాలుకు  వాగులు పొంగిపారుతున్నాయి. వేములవాడ  రూరల్ మండలంలో  ఫాజుల్ నగర్ దగ్గర  బ్రిడ్జిపై  కారు వెళ్తుండగా  ప్రవాహనికి కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఓ మహిళ, బాలుడు చనిపోయారు.  కారు డ్రైవర్ రిజ్వాన్, నరేష్ మాత్రం బయటపడ్డారు. పోలీసులు జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. 

వరంగల్ జిల్లా దేశాయి పేటలో ప్రమాదం జరిగింది. దేశాయిపేట నుంచి పైడిపల్లికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి బైక్ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మృతుల్లో ఒకరు వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన వారు కాగా, మరొకరు సిద్ధిపేటకు చెందిన వారిగా గుర్తించారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్ వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ పై భారీ చెట్టు విరిగి పడింది. దీంతో చెట్టుకింద నలిగి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారడంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిర్యాణిలో పిడుగుపడి 150 మేకలు చనిపోయాయి.
 
యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆలేరు మండలం కొలనుపాకలోని బిక్కేరువాగు దగ్గర పెద్దప్రమాదం తప్పింది. వాగు ఉధృతితో దంపతులు వెళ్తున్న వాహనం కొట్టుకుపోయింది. అక్కడున్న యువకులు గమనించి భార్యభర్తలను కాపాడగా.. వాహనం వాగులో కొట్టుకుపోయింది. 

భద్రాచలం వద్ద 31 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షంతో ప్రజలు ఇళ్లకే  పరిమితమయ్యారు. పాల్వంచలో అత్యథికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో చెరువులు, వాగులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి 31 అడుగులకు చేరుకుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదికి వరద ప్రవాహం పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం, గోదావరి త్రివేణి సంగమంలో వరద పోటెత్తింది. నీటి ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ 8.960 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. జైపూర్ మండలంలోని రసూల్ పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాగు ఉధృతిలో కారు చిక్కుకుపోయింది. స్థానికులు స్పందించి కారులో ప్రయాణిస్తున్న వారిని రక్షించారు. చెన్నూర్ మండలంలో సుద్దాల వాగు ఉప్పొంగడంతో తాత్కాలిక వంతెన నీట మునిగింది. దాదాపు 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూర్  మండలంలోని  అక్కేపల్లి జాతీయ  రహదారి  బతుకమ్మ వాగు  దగ్గర  బ్రిడ్జి తెగిపోయింది. దీంతో రాకపోకలకు  ఆటంకం ఏర్పడింది.  మహారాష్ట్ర, కాళేశ్వరంకు  రాకపోకలు పూర్తిగా  నిలిచిపోయాయి.

ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా వాన ముసురు కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వానలకు సింగూర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద చేరుతోంది. సింగూరు వరదతో మంజీరా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయంలోకి నీరు చేరింది. మెదక్ జిల్లా మంజీరా వరదల్లో చిక్కుకున్న ఆరుగురు గొర్రెకాపర్లను స్థానికులు కాపాడారు. 

మెదక్, కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో ఉన్న పోచారం ప్రాజెక్టులో ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. జమ్మికుంట కాలనీకి చెందిన అల్తాఫ్, అఫ్రీజ్ ప్రాజెక్టులో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి యువకులను కాపాడారు. 

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ దగ్గర పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉదయం పనుల కోసం వెళ్లిన కూలీలు వాగులో ప్రయత్నించి మధ్యలోనే చిక్కుకున్నారు. జేసీబీతో కూలీలను ఒడ్డుకు చేర్చారు. 

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పురాతన వంతెన దగ్గర మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ -మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు అధికారులు.