పూరన్ పూనకాలు..కోల్కతాకు భారీ టార్గెట్

 పూరన్ పూనకాలు..కోల్కతాకు భారీ టార్గెట్

ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో  జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ సిక్సులు, ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్  ఇన్నింగ్స్ గొప్పగా సాగలేదు. ఆ జట్టు 14 పరుగుల దగ్గర కరణ్ శర్మ (3) వికెట్ ను కోల్పోయింది. ఈ సమయంలో డికాక్(28), మన్కడ్(26) జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్ కు 41 పరుగులు జోడించారు. 55 పరుగుల వద్ద వైభవ్ అరోరా మ్యాజిక్ చేశాడు. అదే ఓవర్లో  మన్కడ్, స్టోయినీస్ లను ఔట్ చేశాడు. దీంతో లక్నో 55 పరుగుల వద్దే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కృణాల్ పాండ్యా, ఓపెనర్ డికాక్ కూడా వరుసగా పెవీలియన్ చేరడంతో లక్నో 73కే సగం వికెట్లను నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

పూరన్ పూనకాలు..బదోని మెరుపులు..

ఈ సమయంలో నికోలస్ పూరన్ జట్టును ఆదుకున్నాడు. ఆయుశ్ బదోనితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరో వికెట్ కు 74 పరుగులు జోడించాడు. ఇదే క్రమంలో పూరన్ 30 బంతుల్లో 5 సిక్సులు, 4 ఫోర్లతో 58 పరుగులు సాధించాడు. అయితే 21 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన బదోని పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పూరన్ కూడా ఔటయ్యాడు. చివర్లో  గౌతమ్ కిష్టప్ప మెరుపులు మెరిపించడంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు సాధించింది. కోల్ కతా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా ఒక్కో వికెట్ తీశారు.