RCBvsLSG: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై లక్నో విజయం

RCBvsLSG: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై లక్నో విజయం

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బెంగుళూరు రాయల్స్ ఛాలెంజర్స్ తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో లక్నో...1 వికెట్ తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల టార్గెట్ ను లక్నో సరిగ్గా 20  ఓవర్లలో ఛేదించింది. 

213 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ..ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. కేవలం 1 పరుగు వద్ద కైల్ మేయర్స్ పెవలియన్ చేరాడు. ఆ తర్వాత 23 పరుగుల వద్ద లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. దీపక్ హుడా, కృనాల్ పాండ్యాలు ఔటయ్యారు. దీంతో లక్నో కష్టా్ల్లో పడింది. 

చెలరేగిన స్టోయినీస్

ఈ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ తో కలిసి స్టోయినీస్ జట్టును ఆదుకున్నాడు. నాల్గో వికెట్ కు 75 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో స్టోయినీస్ 30 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. అయితే ఈ సమయంలో స్టోయినీస్ ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు. దీంతో లక్నో 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 

పూరన్ పూనకాలు..

ఈ సమయంలో జట్టును గెలిపించే బాధ్యతను నికోలస్ పూరన్ నెత్తిన వేసుకున్నాడు. బెంగుళూరు బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 7 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇతనికి ఆయుష్ బదోని (30) సహకారం అందించాడు. అయితే చివర్లో లక్నో వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మ్యాచ్ ఉత్కంఠకు చేరుకుంది. అయితే చివరి బంతికి ఆవేశ్ కాన్ పరుగు తీసి లక్నోను గెలిపించాడు. బెంగుళూరు బౌలర్లలో సిరాజ్, పార్నెల్ తలో 3  వికెట్లు దక్కించుకున్నారు. హర్షల్ పటేల్ 2 వికెట్లు ,  కర్ణ్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు కోహ్లీ, డు ప్లెసిస్  జట్టుకు అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు.  ఇద్దరు పోటా పోటీగా బౌండరీలు బాదారు. సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించారు. వీరిద్దరు తొలి వికెట్ కు 96 పరుగులు జత చేశారు. ఇదే క్రమంలో కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అయితే ఈ సమయంలో  కోహ్లీ అమిత్ షా పెవీలియన్ పంపాడు. 

మాక్స్ వెల్ విధ్వంసం..

కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్..తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సిక్సులతో విరుచుకుపడ్డాడు. మాక్స్ వెల్ తో పాటు..డు ప్లెసిస్  సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరు పోటీ పడి మరీ పరుగులు సాధించడం విశేషం. ఇదే క్రమంలో మాక్స్ వెల్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 59 పరుగులు సాధించాడు. అటు డు ప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 79 రన్స్ కొట్టాడు. చివర్లో మాక్స్ వెల్ ఔటయ్యాడు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, అమిత్ మిశ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.