CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై

CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై

ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై చెన్నైకు షాకిస్తూ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో స్టోయినీస్(63 బంతుల్లో 124, 13 ఫోర్లు, 6 సిక్సులు) ఒక్కడే వీరోచిత సెంచరీతో పోరాడి మర్చిపోలేని విజయాన్ని అందించాడు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో లక్నో గెలిచి ఈ టోర్నీలో ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో 213 పరుగులు చేసి గెలిచింది. 

211 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నోకు తొలి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. మూడో బంతికే  డికాక్ డకౌటయ్యాడు. కాసేపటికే రాహుల్ 16 పరుగులు చేసి పెవిలియన్  బాట పట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో  స్టోయినీస్ వీరోచితంగా పోరాడాడు. ఒక్కడే 124 పరుగులు చేసి లక్నోకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. పూరన్(34) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో హుడా 6 బంతుల్లోనే 17 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.చెన్నై బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు తీసుకున్నాడు. ముస్తాఫిజుర్, తుషార్ దేశ్ పాండే చెరో వికెట్ పడగొట్టారు.       

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108,12 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీతో కదం తొక్కగా.. శివమ్ దూబే (27 బంతుల్లో 66, 3 ఫోర్లు, 7 సిక్సులు) మెరుపు హాఫ్ సెంచరీతో  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో హెన్రీ, మోషీన్ ఖాన్,యాష్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు.