చెన్నైపై లక్నో థ్రిల్లింగ్‌ విక్టరీ

చెన్నైపై లక్నో థ్రిల్లింగ్‌ విక్టరీ
  • 211 పరుగులను ఉఫ్‌ అని ఊదేసిన సూపర్‌‌ జెయింట్స్‌‌
  • దంచికొట్టిన డికాక్‌, లూయిస్‌, బదోని
  • సీఎస్​కేకు రెండో ఓటమి

ముంబై:  కొత్త టీమ్‌‌‌‌ లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసింది. తొలి మ్యాచ్‌‌లో చిన్న టార్గెట్‌‌ను కాపాడుకోలేకపోయిన లక్నో తమ రెండో పోరులో 211 రన్స్‌‌ టార్గెట్‌‌ను ఉఫ్‌‌ అని ఊదేసి లీగ్‌‌లో బోణీ కొట్టింది. ఎవిన్‌‌ లూయిస్‌‌ (23 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 నాటౌట్‌‌) మెరుపు ఫిఫ్టీకి తోడు యంగ్‌‌సెన్సేషన్‌‌ ఆయుష్‌‌ బదోని (9 బాల్స్‌‌లో 2 సిక్సర్లతో 19 నాటౌట్‌‌) డేరింగ్‌‌ బ్యాటింగ్‌‌తో గురువారం జరిగిన మ్యాచ్‌‌లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌కు చెక్‌‌ పెట్టింది.  భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన చెన్నై రెండో ఓటమి ఖాతాలో వేసుకుంది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 210/7 స్కోరు చేసింది. రాబిన్‌‌ ఊతప్ప (27 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 50), శివం దూబే (30 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49) విజృంభించారు. అనంతరం లక్నో 19.3 ఓవర్లలో 211/4 స్కోరు చేసి గెలిచింది. క్వింటన్‌‌ డికాక్‌‌ (45 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 61), కెప్టెన్‌‌ లోకేశ్‌‌ రాహుల్‌‌ (26 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) మంచి ఆరంభం ఇవ్వగా.. లూయిస్‌‌, బదోని ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇచ్చారు.  లూయిస్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద  మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 

దంచుడే దంచుడు.. 
చెన్నై బ్యాటర్లంతా బౌండ్రీలే  లక్ష్యంగా ఆడటంతో ఆ టీమ్​ భారీ స్కోర్ చేసింది. మూడో ఓవర్లోనే రుతురాజ్ (1) రనౌటైనా.. మరో ఓపెనర్​ రాబిన్ ఊతప్పతో పాటు వన్​డౌన్​ బ్యాటర్​  మొయిన్ అలీ (35) లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో, పవర్​ప్లేలో  చెన్నై 73/1 స్కోర్ చేసింది.  బిష్నోయ్ వేసిన ఎనిమిదో ఓవర్లో డబుల్​ తీసి 25 బాల్స్ లోనే ఫిఫ్టీ పూర్తి  చేసుకున్న ఊతప్ప.. అదే ఓవర్లో ఔటవ్వడంతో 56 రన్స్ పార్ట్ నర్ షిప్ బ్రేక్ అయింది. అయితే, వస్తూనే మూడు ఫోర్లతో శివం దూబే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో పది ఓవర్లలోనే సీఎస్ కే స్కోరు వంద దాటింది. . కానీ తర్వాతి ఓవర్లో అలీని.. అవేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినా రాయుడు(25)తో కలిసి దూబే దూకుడు కొనసాగించాడు. 17 ఓవర్లో రాయుడును బౌల్డ్ చేసిన బిష్నో య్ 60 రన్స్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆపై జడేజా(17), దూబే బ్యాట్ కు పనిచెప్పడంతో 18 ఓవర్లలో సీఎస్ కే స్కోర్ 188/4. కానీ ఆవేశ్ వేసిన 19వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి దూబే క్యాచ్ ఔటయ్యాడు. చివర్లో ధోనీ (16 నాటౌట్) వచ్చీరాగానే ఓ సిక్స్, ఫోర్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. ఆఖరి ఓవర్లో జడేజా, ప్రిటోరియస్(0) లను ఔట్ చేసిన ఆండ్రూ టై 11 రన్స్ ఇవ్వగా సీఎస్కే  స్కోరు 200 దాటింది. 

లక్నో బ్యాటర్లూ బాదుడే.. 
భారీ టార్గెట్ ఛేజింగ్ లో లక్నోకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు రాహుల్, డికాక్ కావాల్సిన రన్ రేట్ ను తగ్గకుండా చూసుకుంటూ బ్యాటింగ్ చేశారు. ముకేశ్ వేసిన మూడో ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన రాహుల్ ఇన్నింగ్స్ కు ఊపు తీసుకొచ్చాడు.  డికాక్​, రాహుల్​ జోరుతో పవర్ ప్లేలో లక్నో 55/0 స్కోరు చేసింది.  సీఎస్ కే ఫీల్డర్లు  ఈ ఇద్దరి క్యాచ్​లు డ్రాప్​ చేయడం కూడా లక్నోకు కలిసొచ్చింది. ఈ చాన్స్​లను సద్వినియోగం చేసుకున్న ఓపెనర్లు  సగం ఓవర్లకు లక్నోను 98 /0తో పటిష్ట స్థితిలో నిలిపారు.  కానీ ప్రిటోరియస్ వేసిన 11 ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన రాహుల్ క్యాచ్ ఔట్ గా వెనుదిరగడంతో తొలి వికెట్ కు 99 రన్స్ పార్ట్ నర్ షిప్ ముగిసింది. మనీశ్ పాండే (5) తొందరగానే పెవిలియన్ చేరాడు. అయినా.. డికాక్ తో కలిసిన ఎవిన్ లూయిస్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. 15వ ఓవర్లో డికాక్ ను ఔట్ చేసిన ప్రిటోరియస్.. సీఎస్ కే ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపాడు. ఈ దశలో లూయిస్, దీపక్ హుడా(13) ఆచితూచి ఆడారు. 17 ఓవర్లలో 165/3తో నిలిచిన లక్నోకు చివరి మూడు ఓవర్లలో 46 రన్స్ అవసరమయ్యాయి. 18వ ఓవర్ తొలి బాల్ కు సిక్స్ బాదిన హుడా.. తర్వాతి బంతికే షాట్ ఆడి క్యాచ్ ఔట్ అవడంతో మ్యాచ్​లో ఉత్కంఠ రెట్టింపైంది.  చివరి 12 బాల్స్ లో 34 రన్స్ కొట్టాల్సిన స్థితిలో చెన్నైకే అవకాశాలు కనిపించాయి. కానీ,  దూబే వేసిన 19 ఓవర్లో  బదోని 6, లూయిస్ 4, 4, 6 తో విజయ సమీకరణాన్ని 6 బాల్స్ లో 9 రన్స్ గా మార్చారు. లాస్ట్​ ఓవర్లో  బదోని సిక్స్, సింగిల్​తో లక్నోకు విజయాన్ని అందించాడు.

సంక్షిప్త స్కోర్లు
చెన్నై:  20 ఓవర్లలో 210/7 (ఊతప్ప 50, దూబే 49, బిష్నోయ్‌‌ 2/24, అవేశ్‌‌ 2/38).
లక్నో: 19. 3  ఓవర్లలో  (డికాక్‌‌ 61, లూయిస్‌‌ 55*, ప్రిటోరియస్‌‌ 2/31) 

బ్రావో@171 వికెట్లు
డ్వేన్​ బ్రావో ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో దీపక్ హుడా వికెట్ తీయడం ద్వారా మలింగ (170)ను దాటి 171 వికెట్లతో ఈ ఘనత సాధించాడు.