రాజస్తాన్​పై లక్నో ​విక్టరీ

రాజస్తాన్​పై లక్నో ​విక్టరీ

జైపూర్‌‌: బౌలింగ్‌‌లో అవేశ్‌‌ ఖాన్‌‌ (3/25), మార్కస్‌‌ స్టోయినిస్‌‌ (2/28) చెలరేగడంతో.. లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ చిన్న టార్గెట్‌‌ను అద్భుతంగా కాపాడుకుంది. ఆఖరి ఓవర్‌‌లో 19 రన్స్‌‌ అవసరమైన దశలో అవేశ్‌‌ రెండు కీలక వికెట్లు తీయడంతో.. బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో లక్నో 10 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌పై నెగ్గింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 154/7 స్కోరు చేసింది. కైల్‌‌ మేయర్స్‌‌ (42 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51), కెప్టెన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ (32 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 39) రాణించారు. తర్వాత రాజస్తాన్‌‌ 20 ఓవర్లలో 144/6 స్కోరే చేసింది. యశస్వి జైస్వాల్‌‌ (35 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 44), బట్లర్‌‌ (41 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 40) మినహా మిగతా వారు నిరాశపర్చారు. బ్యాట్​తోనూ రాణించిన స్టోయినిస్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

బౌలర్లు సూపర్​..

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రాయల్స్‌‌ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌‌, బట్లర్‌‌ నిలకడగా ఆడినా, ఆఖర్లో లక్నో బౌలర్లు అదరగొట్టారు. సెకండ్‌‌ ఓవర్లో యశస్వి 6, 4 బాదగా, ఐదో ఓవర్‌‌లో బట్లర్‌‌ సిక్స్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు. మధ్యలో వేగం తగ్గినా 10 ఓవర్లకు రాజస్తాన్​ 73/0తో మంచి స్థితిలో నిలిచింది. కానీ 12వ ఓవర్‌‌ నుంచి లక్నో బౌలర్లు జోరు పెంచారు.  స్టోయినిస్‌‌ (2/28-) తన వరుస ఓవర్లలో యశస్వి, బట్లర్‌‌ను ఔట్‌‌ చేయగా.. మధ్యలో శాంసన్‌‌ (2) రనౌటయ్యాడు. దీంతో రాజస్తాన్‌‌ 97/3తో తడబడింది. హిట్టర్​ హెట్‌‌మయర్‌‌ (2) 16వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కు ఔట్‌‌కావడంతో రాయల్స్‌‌ పూర్తిగా డీలా పడింది. ఇంపాక్ట్​ ప్లేయర్​ పడిక్కల్‌‌ (26) 18వ ఓవర్‌‌లో మూడు ఫోర్లు బాది ఆశలు రేపాడు.  చివరి 12 బాల్స్‌‌లో ఆ జట్టుకు 29 రన్స్‌‌ అవసరం అయ్యాయి. రియాన్‌‌ పరాగ్‌‌ (15 నాటౌట్‌‌) సిక్స్‌‌ కొట్టడంతో 19వ ఓవర్‌‌లో 10 రన్స్‌‌ వచ్చాయి. ఇక గెలవాలంటే ఆరు బాల్స్‌‌లో 19 రన్స్‌‌ చేయాల్సిన దశలో అవేశ్‌‌.. 8 పరుగులే ఇచ్చి పడిక్కల్‌‌, ధ్రువ్‌‌ జురెల్‌‌ (0)ను ఔట్‌‌ చేయడంతో రాయల్స్‌‌కు ఓటమి తప్పలేదు. 


మెరిసిన మేయర్స్, రాహుల్​ తొలుత టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన లక్నోకు ఓపెనర్లు రాహుల్‌‌, మేయర్స్‌‌ శుభారంభం ఇచ్చారు. కానీ మిడిలార్డర్‌‌ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితం అయింది. తొలి ఓవర్​ మెయిడిన్​ చేసిన రాయల్స్​ పేసర్​  ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ (1/16) తన రెండో ఓవర్లో రెండే రన్స్​ ఇచ్చాడు. సందీప్‌‌ శర్మ (1/32) కూడా కట్టడి చేయడంతో నాలుగు ఓవర్లలో లక్నో 18 రన్సే చేసింది. 5వ ఓవర్‌‌లో మేయర్స్‌‌ 6, రాహుల్‌‌ 4 కొట్టగా..  పవర్‌‌ప్లేలో లక్నో 37/0 స్కోరుతో నిలిచింది. తర్వాత మేయర్​ జోరు పెంచడంతో సగం ఓవర్లకు లక్నో 79/0 స్కోరు చేసింది. అయితే 11వ ఓవర్‌‌లో రాహుల్‌‌ ఔట్‌‌కావడంతో తొలి వికెట్‌‌కు 82 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. వన్​డౌన్​లో వచ్చిన ఆయూష్‌‌ బదోని (1) ఫెయిలయ్యాడు.

13వ ఓవర్లో మేయర్‌‌ రెండు ఫోర్లు బాదినా, 14వ ఓవర్‌‌లో అశ్విన్‌‌ (2/23) డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. నాలుగు బాల్స్‌‌ తేడాలో దీపక్‌‌ హుడా (2), మేయర్స్‌‌ను ఔట్‌‌ చేయడంతో 15వ ఓవర్లలో స్కోరు 109/4గా మారింది. చివర్లో స్టోయినిస్‌‌ (16 బాల్స్‌‌లో 2 ఫోర్లతో 21), నికోలస్‌‌ పూరన్‌‌ (20 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 29) వేగంగా ఆడటంతో లక్నో కొద్దిగా తేరుకుంది. 19వ ఓవర్‌‌లో పూరన్‌‌ 6, 4, 4తో 17 రన్స్‌‌ రాబట్టినా, లాస్ట్‌‌ ఓవర్‌‌లో మూడు వికెట్లు పడ్డాయి. చివరి 5 ఓవర్లలో 45 రన్స్‌‌ రాబట్టిన లక్నో 150 మార్కు దాటింది.