ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల సీట్ల కింద పెద్ద అరలు.. లగేజీ, ప్రయాణికుల బరువు కలిసి పెరుగుతున్న లోడ్

ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల సీట్ల కింద పెద్ద అరలు.. లగేజీ, ప్రయాణికుల బరువు కలిసి పెరుగుతున్న లోడ్
  • మోడిఫై చేసి కమర్షియల్ ​గూడ్స్ తరలింపు 
  • ఆర్టీఏ తనిఖీల్లో బయటపడుతున్న ప్రైవేటు బస్సుల డొల్లతనం
  • మూడు రోజుల్లో 143 కేసుల నమోదు, ఆరు బస్సులు సీజ్​ 

హైదరాబాద్​ సిటీ, వెలుగు: కర్నూలు బస్సు ప్రమాదం ఘటన నేపథ్యంలో మూడు రోజులుగా ఆర్టీఏ అధికారులు గ్రేటర్​ లో ప్రైవేట్​బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ప్రైవేటు బస్సుల డొల్లతనం బయటపడుతోంది. హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల్లో సోమవారం కూడా తనిఖీలు చేసి, 54  కేసులు నమోదు చేయడంతో పాటు ఒక బస్సు సీజ్​చేశారు. అలాగే, 1.20 లక్షల జరిమానా విధించారు. 

ఈ సందర్భంగా కొందరు ప్రైవేట్​బస్సుల నిర్వాహకులు బస్సు సీట్లను మోడిఫై చేసి ఎక్కువ సీట్లను అమరుస్తున్నట్టు తెలుసుకున్నారు. బస్సు కింది భాగంలో కమర్షియల్​గూడ్స్, ప్రయాణికుల సామగ్రి కూడా ట్రాన్స్​పోర్ట్​చేస్తున్నారు. దీని కోసం ప్రయాణికుల సీట్ల కింది వైపు ప్రత్యేకంగా పెద్ద అరనే ఏర్పాటు చేస్తున్నారు.

దీంతో లగేజీ బరువు, ప్రయాణికుల బరువు కలిసి  లోడ్​ పెరిగిపోతోంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటి వరకూ 143 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. జరిమానాగా 3.06 లక్షలు వసూలు చేయగా, 5 బస్సులను సీజ్​ చేసినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.