హైదరాబాద్: GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) డీలిమిటేషన్ (వార్డుల పునర్విభజన) వ్యవహారం హైకోర్టుకు చేరడంతో రాజకీయంగా, పరిపాలనా పరంగా ఈ అంశం ఆసక్తికరంగా మారింది. GHMC పరిధిలో చేపట్టిన వార్డుల పునర్విభజన అసంబద్ధంగా, ఏకపక్షంగా జరిగిందని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశం అత్యవసరమని పేర్కొంటూ పిటిషనర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
జనాభా ప్రమాణాలు, భౌగోళిక సౌలభ్యం, పరిపాలనా సమతుల్యతను పక్కనపెట్టి డీలిమిటేషన్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగేలా, మరికొన్ని ప్రాంతాలకు లాభం చేకూరేలా వార్డుల విభజన జరిగిందనేది వాదన. ప్రజాప్రతినిధులు, స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది.
లంచ్ మోషన్ కావడంతో అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందా..? లేక డీలిమిటేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా? అనే అంశాలపై కోర్టు ప్రాథమికంగా పరిశీలించే అవకాశం ఉంది. డీలిమిటేషన్ చట్టబద్ధంగానే జరిగిందని ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. జనాభా లెక్కలు, అధికారిక మార్గదర్శకాల ప్రకారమే వార్డుల పునర్విభజన చేపట్టామని ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది.
GHMC డీలిమిటేషన్ అంశం మున్సిపల్ ఎన్నికలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో హైకోర్టు ఇచ్చే ఆదేశాలు రాజకీయంగా కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. అవసరమైతే కోర్టు స్టే, లేదా ప్రభుత్వం నుంచి వివరణ కోరే అవకాశం ఉంటుంది.
