
క్యాన్సర్..ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి..ప్రపంచవ్యాప్తంగా రకరకాల క్యాన్సర్లతో లక్షలాది మంది బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్మరణాలకు ప్రధాన కారణం ఊపిరితిత్తుల క్యాన్సర్.2020లో 22 లక్షల కొత్త కేసులు బయటపడ్డాయి. భారత దేశంలో క్యాన్సర్ కేసుల్లో 6శాతం ఇవేనట. ఊపిరి తిత్తుల క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో నిరంతర దగ్గు ముఖ్య లక్షణం. అయితే అది ఒక్కటే సంకేతం కాదు.. నిర్లక్ష్యం చేయకూడని మరికొన్ని లక్షణాలున్నాయని అంటున్నారు డాక్టర్లు.
దగ్గు కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు మరికొన్ని సంకేతాలు
శ్వాస ఆడకపోవడం: మెట్లు ఎక్కడం వంటి రోజువారీ కార్యకలాపాలు మిమ్మల్ని ఊపిరి ఆడకుండా చేస్తుంటే..అది వాయుమార్గాలను అడ్డుకునే కణితి లేదా ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం పేరుకుపోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుందని సంకేతం కావచ్చు.
ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం: లోతైన శ్వాస, దగ్గు లేదా నవ్వినప్పుడు ఛాతీ నొప్పి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను సూచిస్తుంది. ఈ నొప్పి ఛాతీ గోడలు లేదా నరాలపై కణితి ఒత్తిడి వల్ల కావొచ్చు.
బరువు తగ్గడం: ఆహారం లేదా వ్యాయామంలో మార్పులు లేకుండా ఆకస్మిక బరువు తగ్గడం కూడా ఓ సంకేతం. క్యాన్సర్ కణాలు తరచుగా జీవక్రియ, శక్తి వినియోగంలో మార్పులు తెస్తాయి. దీంతో బరువు,కండరాలు క్షీణించవచ్చంటున్నారు.
గొంతు బొంగురుపోవడం: స్వర తంతువులను నియంత్రించే నరాలపై కణితి గొంతు బొంగురుపోయేలా చేస్తుంది. స్వరంలో మార్పులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలంటున్నారు.
దగ్గుతో రక్తం (హెమోప్టిసిస్): కఫంలో తక్కువ మొత్తంలో రక్తం ఉన్నా కూడా తీవ్రంగా పరిగణించాలి. ఊపిరితిత్తులలోని రక్త నాళాలను చికాకు పెట్టే కణితుల వల్ల ఇలా జరగొచ్చు.
ఈ ఐదు లక్షణాలుంటే కూడా వైద్యులను సంప్రదించాలంటున్నారు.