లగ్జరీ కాలనీలే టార్గెట్‌‌గా చోరీలు

లగ్జరీ కాలనీలే టార్గెట్‌‌గా చోరీలు
  • ఇద్దరు దొంగల అరెస్ట్
  • రూ.50 లక్షలు విలువైన బంగారం, 2 బైక్​లు రికవరీ

హైదరాబాద్‌‌, వెలుగు: లగ్జరీ కాలనీలను టార్గెట్‌‌ చేసి వరుస చోరీలు చేస్తున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్  చేశారు.  ఈస్ట్‌‌జోన్‌‌ డీసీపీ సునీల్​దత్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని  వెస్ట్‌‌ గోదావరి జిల్లా కొండగూడెం గ్రామానికి చెందిన మనుకొండ అనిల్‌‌కుమార్‌‌‌‌(31) పదేండ్లుగా చోరీలు చేస్తున్నాడు. కొట్టేసిన వాటిని అమ్మి ఆ డబ్బుతో గోవా, బెంగళూరులో తిరిగేవాడు. ఏపీ, తెలంగాణలో 30 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతేడాది మార్చిలో ఏపీలోని తడికలపూడిలో నమోదైన కేసులో అనిల్ కుమార్ పోలీసులకు పట్టుబడగా.. అతడిపై పీడీ యాక్ట్‌‌ ప్రయోగించారు. నవంబర్‌‌‌‌ 26న జైలు నుంచి విడుదలయ్యాడు.

అనంతరం శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఇచ్చాపురం గోపి(34)తో కలిసి చోరీలు ప్రారంభించాడు. వీరిద్దరు చోరీకి ముందు బైక్‌‌ను దొంగిలించే వారు. టార్గెట్‌‌ చేసిన ఇండ్లలో దొంగతనం చేసి ఎస్కేప్‌‌ అయ్యేవారు. కొట్టేసిన వాటిని బోడుప్పల్‌‌కు చెందిన పి. కార్తీక్‌‌(35) ద్వారా అమ్మేవారు. మలక్‌‌పేట్‌‌ పీఎస్‌‌ పరిధిలో గత నెల జరిగిన చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనిల్ కుమార్, గోపిపై నిఘా పెట్టిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రూ. 50 లక్షల విలువైన 690 గ్రాముల బంగారు నగలు, 2 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఉన్న కార్తీక్ కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.