- నిఖా హలాలా, ట్రిపుల్ తలాక్‌లు నేరం.. బహుభార్యత్వం నిషేధం
- సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లేదంటే 3 నెలల జైలు, 10 వేలు ఫైన్
భోపాల్: యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ– ఉమ్మడి పౌర స్మృతి) ముసాయిదా బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆదివారం ఆమోదం తెలిపింది. నిఖా హలాలా, ట్రిపుల్ తలాక్‌లను నేరంగా పరిగణించేలా, బహుభార్యాత్వాన్ని నిషేధించేలా, సహజీవనాన్ని నెల రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోకపోతే మూడు నెలల జైలు శిక్ష విధించేలా ఈ డ్రాఫ్ట్ బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా బిల్లు అన్ని వర్గాలలో ఏకపత్నిత్వాన్ని (లేదా ఏకభర్తృత్వాన్ని) తప్పనిసరి చేస్తుంది.
ఒక వ్యక్తి ఒక సమయంలో ఒకే ఒక భాగస్వామితో వివాహం కలిగి ఉండవచ్చు. సమ్మతి ఆధారంగా లేదా నిషేధిత బంధుత్వాల మధ్య జరిగే వివాహాలను (ఆచారాల ప్రకారం అనుమతించబడితే తప్ప) నిషేధించారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం, సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) ద్వారా జన్మించిన పిల్లలకు చట్టపరమైన హోదా కల్పిస్తారు. పురుష భాగస్వామి మహిళా భాగస్వామిని వదిలివేస్తే, ఆమె చట్టబద్ధమైన భార్యలాగే కోర్టు ద్వారా భరణం క్లెయిమ్ చేయవచ్చు. గిరిజన వర్గాలను మినహాయించి, అన్ని మతాల వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్‌ను కూడా ఈ బిల్లు తప్పనిసరి చేస్తుంది.
ప్రతిపాదిత చట్టం ప్రకారం, సహజీవనంలో ఉన్న జంటలు కలిసి జీవించడం ప్రారంభించిన నెల రోజుల్లోగా రిజిస్ట్రార్‌కు ‘స్టేట్‌మెంట్ ఆఫ్ లివ్-ఇన్ రిలేషన్‌షిప్’ను సమర్పించడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండా నెల కంటే ఎక్కువ కాలం సహజీవనం చేస్తే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 జరిమానా, తప్పుడు సమాచారం ఇస్తే మూడు నెలల జైలు, రూ.25,000 జరిమానా, రిజిస్ట్రార్ నుంచి నోటీసు వచ్చినా స్టేట్‌మెంట్ ఇవ్వడంలో విఫలమైతే ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ. 25,000 జరిమానాను విధించేలా ఈ బిల్లులో ప్రతిపాదించారు.
ఇకపై అందరికీ ఒకే చట్టం: సీఎం మోహన్ యాదవ్
భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో కేబినెట్ ఈ బిల్లును ఆమోదించింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. ఇకపై రాష్ట్రంలో ‘రామ్, రహీమ్’లతో సహా అందరికీ ఒకే విధమైన చట్టం ఉంటుందని చెప్పారు.
