మా సిటీ’ ప్లాట్లు అధిక రేట్లు పలకడంపై ప్రైవేటు వెంచర్ల ఓనర్ల హస్తం ఉందనే ఆరోపణలు

మా సిటీ’ ప్లాట్లు అధిక రేట్లు పలకడంపై ప్రైవేటు వెంచర్ల ఓనర్ల హస్తం ఉందనే ఆరోపణలు

వరంగల్‍, వెలుగు: కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ ఆధ్వర్యంలో మడిపల్లిలోని ఏర్పాటు చేసిన ‘మా సిటీ’ ప్లాట్లు అధిక రేట్లు పలకడం వెనుక ప్రైవేటు వెంచర్ల ఓనర్ల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా సిటీ చుట్టుపక్కల వెలసిన ప్రైవేట్ వెంచర్ల రేట్లు పెంచేందుకే వారంతా ‘మాసిటీ’ ప్లాట్ల వేలంలో ఎక్కువ రేట్లు పలికారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ‘సామాన్యులకు అందుబాటులో ధరలోనే ప్లాట్లు’ అని కుడా ప్రచారం చేసినా, వేలం పాటలో మాత్రం సామాన్యులకు అందనంత దూరంలో పాడారు.

పక్కన రూ.8వేలు.. ఇక్కడ రూ.17వేలు..
మడిపల్లిలోని ‘మా సిటీ’ వెంచర్‍ చుట్టుపక్కన గజం రూ.6వేల నుంచి రూ.8వేలు పలుకుతుండగా.. కుడా వెంచర్లో మాత్రం ఇందుకు రెట్టింపు ధర పలికింది. తొలుత కుడా ఆఫీసర్లు గజానికి రూ.8వేలు కనిష్ఠ ధరగా నిర్ణయించగా.. వేలం పాటలో మాత్రం రూ.15,700 రేటు పలికింది. ఈశాన్యం ప్లాటుకు అత్యధికంగా రూ.17,050 వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. అయితే ‘మా సిటీ’ చుట్టుపక్కన ఉన్న వెంచర్ల రేట్లు పెంచుకునేందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై వేలం పాటలో ఎక్కువ రేట్లు పాడారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రేట్లను కారణంగా చూపి రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారులు తమ వెంచర్‍ రేట్లను పెంచుకునే ఆస్కారం దొరికినట్లయింది. ఇది నిజమన్నట్లుగా  ఓ వైపు వేలం పాట నిర్వహిస్తుండగానే.. మరోవైపు దేవన్నపేట, మడిపల్లి దారిలో ఉండే ఇతర ప్రైవేట్‍ వెంచర్ల నిర్వాహకులు టెంట్లు వేసుకుని ప్రచారానికి దిగారు. కుడా ప్లాట్ల కంటే గజానికి రూ.వెయ్యి తక్కువ చేసి అమ్ముతున్నారు.

అమ్ముడుపోయాయిలా..
మడిపల్లి ‘మా సిటీ’ వెంచర్‍ లో 2019లో 51 ప్లాట్లు అమ్మకానికి పెట్టగా 31 ప్లాట్లు అమ్ముడుపోయాయి. అప్పుడు కనీస ధర రూ.3 వేలు నిర్ణయించగా వేలంలో గరిష్ఠంగా రూ.8 వేలకు విక్రయించారు. ఈసారి 99 రెసిడెన్షియల్‍ ప్లాట్లు, మరో 15 ఫాంహౌజ్‍ ప్లాట్లకు ఆక్షన్‍ పెట్టగా గజానికి కనీస ధర రూ.8 వేలు నిర్ణయించారు. వేలం పాట గడువు ముగిసే సమయానికి 51 ప్లాట్లు అమ్ముడుపోయాయి.

సౌకర్యాలపై అసంతృప్తి..
‘మా సిటీ’లో ధరకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోవడంపై బిడ్డర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ, స్ట్రీట్‍ లైట్లు వేయకుండా ఆక్షన్ నిర్వహించారని మండిపడ్డారు.  2019 జనవరిలో మొదటి దఫా ప్లాట్ల వేలం వేయగా.. నాలుగేళ్లు దగ్గరకొస్తున్నా కనీస సౌలతులు కల్పించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, రాబోయే ఐదేండ్లలో సౌకర్యాలు కల్పిస్తామని ‘కుడా’ ఆఫీసర్లు చెబుతుండడం గమనార్హం.